
తన కుమారుడు అభిషేక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వందతులను ఎవరూ నమ్మవద్దని ఎంపీ సుమలత అన్నారు. శనివారం అంబరీశ్ పుణ్యతిథిని పురస్కరించుకుని యశవంతపురలోని కంఠీరవ స్టూడియోలో అంబరీశ్ సమాధికి ఆమె నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మద్దూరు నుంచి అభిషేక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.
అనవసరంగా అభిషేక్‌ను రాజకీయాల్లోకి లాగ వద్దని, తను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ప్రస్తుతం దర్యాప్తు చేయాలని కోరటం లేదన్న సుమలత, ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందన్నారు. సుమలత వెంట అభిషేక్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.