సుమంత్
‘‘హీరో పరిచయ సన్నివేశాలు కావాలి.. స్లో మోషన్ బిల్డప్ షాట్స్ కావాలని కోరుకోను. అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. విజిల్స్ వేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తాను. కానీ స్క్రిప్ట్‌లో అవసరం లేనప్పుడు ఎందుకు అన్నది నా ఫీలింగ్. నా సినిమా పూర్తి అయ్యాక విజిల్స్ వేయండి’’ అని సుమంత్ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ పంచుకున్న విశేషాలు...
► ‘సుబ్రహ్మణ్యపురం’ కథా చర్చలప్పుడు ‘కాన్సెప్ట్ నచ్చదు.. మిడిల్ డ్రాప్ అవుదాం’ అనే ఆలోచనతో విన్నాను. కానీ, గ్రిప్పింగ్ కథతో రెండున్నర గంటలు కూర్చోబెట్టాడు సంతోష్. తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. అన్నీ థ్రిల్లర్సే. తన షార్ట్‌ఫిల్మ్స్ చూశాక నమ్మకం వచ్చింది.
► ఈ సినిమాలో హీరో దేవుడిని నమ్మడు. కానీ, పురాతన గుళ్ల గురించి అధ్యయనం చేస్తుంటాడు. హీరోయిన్ దేవుణ్ణి నమ్ముతుంది. దాంతో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా ఉంటుంది. అది సబ్‌ప్లాట్. మెయిన్ పాయింట్ వేరే ఉంటుంది. అది ఆసక్తిగా ఉంటుంది. పర్సనల్‌గా దేవుడిని నమ్ముతాను.. నమ్మను అని కాదు.. పట్టించుకోను. చరిత్ర, సంప్రదాయాల మీద నాకు ఆసక్తి ఉంటుంది.
► ‘మళ్ళీరావా’ స్క్రిప్ట్ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. అందుకే వెంటనే చేసేశాను. కమర్షియల్ మీటర్‌లో ఉందా లేదా అని ఆలోచించను. అదే నా ప్లస్సు, మైనస్సు అనుకుంటా. ఇది కమర్షియల్‌గా ఉంటుంది, ఇది ఉండదు అని లెక్కలు వేసుకొని సినిమా చేయను. కథ నచ్చితే చేస్తా. ‘మళ్ళీరావా’ విడుదల తర్వాత రొమాంటిక్ డ్రామాలు వస్తాయనుకున్నా. కానీ, అన్నీ థ్రిల్లర్ సినిమాలే రావడంతో ఆశ్చర్యపోయా.
► కొత్త దర్శకులతో వర్క్ చేస్తున్నాను. సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. క్యారెక్టర్, స్టోరీ మాత్రమే కథను ముందుకు నడిపిస్తుంటాయి. ఈ చిత్రంలో కావాలని ఏం ఇరికించలేదు. స్క్రిప్ట్ బేస్డ్ సినిమా ఇది. నెక్ట్స్ చేయబోయే సినిమా ‘ఇదం జగత్’ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్.
► ‘సుబ్రహ్మణ్యపురం’లో స్పష్టమైన తెలుగు భాషను ఉపయోగించాం. అలా మాట్లాడే వాళ్లతో డబ్బింగ్ చెప్పిద్దాం అనుకోగానే నాకు రానానే మనసులో కనిపించాడు. తను అప్పుడు బాంబేలో ఉన్నాడు. హైదరాబాద్ రావడం కుదరకపోవడంతో అక్కడే డబ్బింగ్ చెప్పించాం.
► క్రిష్ నా అభిమాన దర్శకుడు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ కోసం ఆయన సంప్రదించగానే కళ్లు మూసుకొని ఓకే చెప్పేశా. రెండు పార్ట్స్‌లోనూ కనిపిస్తాను. టఫ్, ఈజీ అని కాదు.. కథ నచ్చింది. చేసేశాను. ఈ సినిమా కోసం నేను చేసిన పెద్ద హోమ్ వర్క్ ఏంటంటే.. తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) సినిమాలు, ఇంటర్వ్యూలు అన్నీ తిరగేశాను. అలాగని ఇమిటేట్ చేయాలనుకోలేదు.
► నాలో తాతగారి పోలికలు ఉన్నాయి అని అందరికీ తెలుసు. అదృష్టవంతుడిని. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మేకప్ వేసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని నేనే నమ్మలేకపోయా. ‘మహానటి’లో చైతూని(నాగచైతన్య) చూసినప్పుడు భలే నచ్చింది. ‘గూఢచారి’లో సుప్రియ నటన చూసి షాక్ అయ్యాను. బాగా చేసింది.
► బీరం సుధాకర్‌రెడ్డిగారు ఇంతకుముందు ఫైనాన్సియర్‌గా చేశారు. పూర్తిస్థాయి నిర్మాతగా తొలి సినిమా ఇది. మార్కెటింగ్ కూడా బాగా చేశారు. చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో చేశాం. శేఖర్ చంద్రతో పని చేయడం ఫస్ట్ టైమ్. థ్రిల్లర్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. 3 పాటలుంటాయి. చాలా బాగా ఇచ్చాడు. కీరవాణిగారి స్టైల్ కనిపించింది.
► ‘ఇదం జగత్’ కూడా రిలీజ్‌కు రెడీ అయింది. ఆ సినిమా దర్శకుడు అనిల్ శ్రీకంఠం కొత్తవాడే. బ్రదర్, సిస్టర్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment