Subrahmanyapuram
-
పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే
సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకునిగా పరిచయం అయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ఫుల్ కలెక్షన్లను సాధిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుమంత్ మాట్లాడుతూ– ‘‘నేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఈ రోజుల్లో సక్సెస్ అంటే మూడు రకాలుగా డివైడ్ చెయ్యొచ్చు. మొదటిది విపరీతంగా కలెక్షన్లు సాధించి దుమ్ము దులపటం. రెండోది విమర్శకుల ప్రశంసలతో పాటు పేరు, అవార్డులు రావడం. ఇక మూడోది నిర్మాత పెట్టిన డబ్బు ఆయనకి తిరిగి రావటం. ఈ కాలంలో అలా జరగటం చాలా అరుదు. పది శాతం సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడిని సాధిస్తున్నాయి. ఇందులో మా సినిమా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ’’ అన్నారు. సంతోశ్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను, కథనాన్ని నమ్మిన భీరం సుధాకర్‌గారికి థ్యాంక్స్. నా ఫేవరెట్ హీరో సుమంత్. ఆయనతో నా మొదటి సినిమా చేసి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు. భీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి అడుగుపెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన సుమంత్ గారితో పాటుయూనిట్కు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, ‘జోష్’ రవి పాల్గొన్నారు. -
ఎలక్షన్లోనూ కలెక్షన్స్ బాగున్నాయి
‘‘తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ నుంచి మంచి రిపోర్ట్స్ వింటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడినప్పుడు చాలా మంచి టాక్ వచ్చిందని చెప్పడంతో సంతోషంగా ఉంది. దర్శకుడు సంతోష్‌లాగా ఎవరైనా మంచి కథతో వస్తే ఏ జానర్లో అయినా సినిమా చేయడానికి రెడీ’’ అని సుమంత్ అన్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘కథను నమ్మి అవకాశం ఇచ్చిన బీరం సుధాకర్ రెడ్డిగారికి, సుమంత్‌గారికి థ్యాంక్స్. అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ కాల్ చేసి సినిమా బావుందన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాలో సెకండ్ హాఫ్‌కి మంచి ప్రశంసలు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఉదయం ఆట నుంచే మా సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లు సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. మేం అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయానికి సహకరించిన సుమంత్‌గారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు బీరం సుధాకర్ రెడ్డి. -
‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ రివ్యూ
టైటిల్ : సుబ్రహ్మణ్యపురం జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బా, సురేష్, భద్రం, జోష్ రవి తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర నిర్మాత: భీరం సుధాకర్ రెడ్డి దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి ‘మళ్లీరావా’ లాంటి కూల్ హిట్‌తో పలకరించిన సుమంత్.. తన పంథాను మార్చుకుని డిఫరెంట్ జానర్లో తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యాడు. సుమంత్ కొత్తగా ట్రై చేస్తూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యపురం’తో ఈ శుక్రవారం(డిసెంబర్ 7) ఆడియెన్స్‌ను పలకరించాడు. మరి ఈ సినిమాతో సుమంత్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? కొత్తగా ట్రై చేసిన ఈ మూవీ సుమంత్‌కు కలిసివచ్చిందా? ఓ సారి కథలోకి వెళ్దాం.. కథ : సుబ్రహ్మణ్యపురం గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడి గుడిలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి అభిషేకం జరగదు. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి విగ్రహానికి అభిషేకం చేస్తాడు. తరువాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అప్పటినుంచి వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి.(సాక్షి రివ్యూస్) అయితే ఇదంతా దైవమహిమ అనుకుంటూ ఊళ్లో వాళ్లు భయపడుతుంటారు. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలేంటి? అసలు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు నిర్వహించరు? వీటన్నంటిని కనిపెట్టడానికి సుమంత్ చేసిన ప్రయత్నాలేంటి? అనేదే మిగతా కథ. నటీనటులు : కార్తీక్ (సుమంత్).. పురాతన దేవాలయాలపై పరిశోదన చేస్తూ ఉంటాడు. కార్తీక్‌కు దేవుడు అంటే నమ్మకం ఉండదు. ప్రతిదానికి కారణాలు వెతుకుతుంటాడు. హేతువాది పాత్రలో సుమంత్ బాగా చేశాడు. సత్యం, మళ్లీరావా లాంటి సినిమాల్లో కూల్ పర్ఫామెన్స్ ఇచ్చిన సుమంత్ ఈ చిత్రంలో తన నటనలోని మరో కోణాన్ని చూపించారు.(సాక్షి రివ్యూస్) ఇక ప్రియా పాత్రలో నటించిన ఈషా రెబ్బ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. సుమంత్ స్నేహితులుగా నటించిన భద్రం, జోష్ రవి ఫర్వాలేదనిపించారు. సాయి కుమార్, ఎస్సై పాత్రలో అమిత్ శర్మ, గిరి, గ్రామ పెద్దగా నరేంద్ర వర్మ క్యారెక్టర్లో సురేష్ తమ పరిధిమేరకు మెప్పించారు. విశ్లేషణ : దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ సక్సెస్ ఫార్మూలానే. నమ్మకాలు-నిజాలు, వాస్తవాలు-ఊహలకు మధ్య అల్లే కథ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ అల్లే కథాకథనాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. (సాక్షి రివ్యూస్)ఇదివరకు ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వచ్చినా.. సుబ్రహ్మణ్యపురం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అయితే వీటిని తెరకెక్కించేప్పుడు గత చిత్రాల ప్రభావం పడకుండా చూసుకుంటే ఇంకా బాగుండేది. ఇలాంటి కథలో వేగం ముఖ్యం. అదే ఈ చిత్రంలో కాస్త కొరవడినట్టు కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ లోపాలు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్ కథ మైనస్ పాయింట్స్ : స్లో నెరేషన్ నిడివి బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
పని అడిగితే తప్పు కాదు కదా?
‘‘సుబ్రహ్మణ్యపురం’ కథని డైరెక్టర్ సంతోష్ రెండు గంటలు చెప్పారు. కథ వింటున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. అన్ని రకాల సినిమాలు చూస్తాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్ట్స్ ఏమవుతుంది? అని టెన్షన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ ‘సుబ్రహ్యణ్యపురం’లో చాలా ఉన్నాయి’’ అని ఈషా రెబ్బ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్యణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ– ‘‘ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్ర నాది. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులోనూ తండ్రి అంటే మరింత ఇష్టం. ఈ చిత్రంలో లవ్ స్టోరీ ఉంటుంది. కానీ అది థ్రిల్లర్ అనుభూతికి అడ్డుకాదు. నేను భక్తురాలిగా కనిపిస్తాను. సుమంత్ కంప్లీట్‌గా నాకు ఆపోజిట్ రోల్ ప్లే చేశారు. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడిపై రీసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య లవ్ ఫీల్ ఎలా కలిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్‌లో వర్క్ చేయాలని ఉంటుంది. నేనే అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను.. పని అడగటంలో తప్పు లేదు కదా? తెలుగు అమ్మాయిలకు ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి. ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు. -
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం : ఈషా
సుమంత్, ఈషారెబ్బ జంటగా సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ బ్యానర్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడి పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘దర్శకుడు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్ ల నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. రెండు పాత్రల అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయి కి మద్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.సుమంత్ నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది. నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. -
అందుకే నిర్మాతగా మారా
‘‘‘కార్తికేయ, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’ వంటి సినిమాలకు ఫైనాన్స్ చేశాను. ‘సుబ్రహ్మణ్యపురం’ కథ నచ్చి నిర్మాతగా మారాను. అంతా అనుకున్న విధంగానే జరిగింది. ఫైనాన్షియర్‌గా వర్క్ చేసిన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది’’ అన్నారు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి చెప్పిన విశేషాలు.... ► కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యపురం పుత్తూరు అనే గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కట్టించింది మా పూర్వీకులే. మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యస్మామి. ►‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా కథను సంతోష్ మరో నిర్మాతకు చెబుతుంటే నేను విన్నాను. సంతోష్ కథ చెప్పిన విధానం ఇంకా నచ్చి నిర్మాతగా మారాను. ఆ తర్వాత సంతోష్ తీసిన షార్ట్‌ఫిల్మ్స్‌ను పరిశీలించాను. సంతోష్ చెప్పింది చెప్పినట్లు తీశారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఆరు కోట్లు అయింది. ►ఈ కథకు సుమంత్‌గారు సెట్ అవుతారని ఆయన్ను తీసుకున్నాం. సుమంత్‌గారి అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. దేవుడి మహిమ గొప్పదా? మానవ మేధస్సు గొప్పదా? అనే అంశాలను సినిమాలో చర్చించాం. సైంటిఫిక్ అంశాలు కూడా ఉన్నాయి. ఏది గొప్ప అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ►‘మదరాసు ఏస్టేట్’ అని చెన్నైలో నాకు కంపెనీ ఉంది. చెన్నై టు సేలం ఫంక్షన్ హాల్స్ కట్టాలనుకుంటున్నాం. ముందుగా ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కుదర్లేదు. కార్తీకమాసం చివరి రోజు అని రేపు విడుదల చేస్తున్నాం. రిలీజ్ రోజు అమావాస్య అని కూడా అన్నారు. చెన్నైలో మేం ఏం స్టార్ట్ చేసినా అమావాస్య రోజునే స్టార్ట్ చేస్తాం. ఆ కంపెనీస్‌లో ముఖ్యవాటాదారు నేనే. బాగానే ఉంది. అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. 2019లో మా సంస్థ నుంచి ఇంకా పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి. త్వరలో వివరాలు చెబుతాను. -
కుటుంబసమేతంగా.. ‘సుబ్రహ్మణ్యపురం’
‘మళ్లీరావా’ సినిమా విజయంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ కథాంశంతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సుమంత్‌కు 25 చిత్రం కావడం విశేషం. సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడంతో పాటు కథ నచ్చడంతో నేనే ప్రొడ్యూస్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మా సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమా 'మానవ మేధస్సు గొప్పదా - దైవశక్తి గొప్పదా' అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించడం విశేషం. (‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్ రెస్పాన్స్) పూర్వకాలం,సెకండ్ వరల్డ్ వార్ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈసినిమాలో ఉంటాయి. మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ స్టోరీకి సుమంత్ గారైతే యాప్ట్‌గా ఉంటుందని ముందే ఫిక్సయ్యాం. ఈ సినిమాలో కూడా కథకు అనుగుణంగా గ్రాఫిక్స్‌కు మంచిప్రాధాన్యం ఉంటుంది’ అంటూ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. (నా ప్లస్, మైనస్ అదే) -
‘సుబ్రహ్మణ్యపురం’ ఆడియో లాంచ్
-
నా ప్లస్, మైనస్ అదే
‘‘హీరో పరిచయ సన్నివేశాలు కావాలి.. స్లో మోషన్ బిల్డప్ షాట్స్ కావాలని కోరుకోను. అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. విజిల్స్ వేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తాను. కానీ స్క్రిప్ట్‌లో అవసరం లేనప్పుడు ఎందుకు అన్నది నా ఫీలింగ్. నా సినిమా పూర్తి అయ్యాక విజిల్స్ వేయండి’’ అని సుమంత్ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ పంచుకున్న విశేషాలు... ► ‘సుబ్రహ్మణ్యపురం’ కథా చర్చలప్పుడు ‘కాన్సెప్ట్ నచ్చదు.. మిడిల్ డ్రాప్ అవుదాం’ అనే ఆలోచనతో విన్నాను. కానీ, గ్రిప్పింగ్ కథతో రెండున్నర గంటలు కూర్చోబెట్టాడు సంతోష్. తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. అన్నీ థ్రిల్లర్సే. తన షార్ట్‌ఫిల్మ్స్ చూశాక నమ్మకం వచ్చింది. ► ఈ సినిమాలో హీరో దేవుడిని నమ్మడు. కానీ, పురాతన గుళ్ల గురించి అధ్యయనం చేస్తుంటాడు. హీరోయిన్ దేవుణ్ణి నమ్ముతుంది. దాంతో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా ఉంటుంది. అది సబ్‌ప్లాట్. మెయిన్ పాయింట్ వేరే ఉంటుంది. అది ఆసక్తిగా ఉంటుంది. పర్సనల్‌గా దేవుడిని నమ్ముతాను.. నమ్మను అని కాదు.. పట్టించుకోను. చరిత్ర, సంప్రదాయాల మీద నాకు ఆసక్తి ఉంటుంది. ► ‘మళ్ళీరావా’ స్క్రిప్ట్ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. అందుకే వెంటనే చేసేశాను. కమర్షియల్ మీటర్లో ఉందా లేదా అని ఆలోచించను. అదే నా ప్లస్సు, మైనస్సు అనుకుంటా. ఇది కమర్షియల్‌గా ఉంటుంది, ఇది ఉండదు అని లెక్కలు వేసుకొని సినిమా చేయను. కథ నచ్చితే చేస్తా. ‘మళ్ళీరావా’ విడుదల తర్వాత రొమాంటిక్ డ్రామాలు వస్తాయనుకున్నా. కానీ, అన్నీ థ్రిల్లర్ సినిమాలే రావడంతో ఆశ్చర్యపోయా. ► కొత్త దర్శకులతో వర్క్ చేస్తున్నాను. సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. క్యారెక్టర్, స్టోరీ మాత్రమే కథను ముందుకు నడిపిస్తుంటాయి. ఈ చిత్రంలో కావాలని ఏం ఇరికించలేదు. స్క్రిప్ట్ బేస్డ్ సినిమా ఇది. నెక్ట్స్ చేయబోయే సినిమా ‘ఇదం జగత్’ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ► ‘సుబ్రహ్మణ్యపురం’లో స్పష్టమైన తెలుగు భాషను ఉపయోగించాం. అలా మాట్లాడే వాళ్లతో డబ్బింగ్ చెప్పిద్దాం అనుకోగానే నాకు రానానే మనసులో కనిపించాడు. తను అప్పుడు బాంబేలో ఉన్నాడు. హైదరాబాద్ రావడం కుదరకపోవడంతో అక్కడే డబ్బింగ్ చెప్పించాం. ► క్రిష్ నా అభిమాన దర్శకుడు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ కోసం ఆయన సంప్రదించగానే కళ్లు మూసుకొని ఓకే చెప్పేశా. రెండు పార్ట్స్‌లోనూ కనిపిస్తాను. టఫ్, ఈజీ అని కాదు.. కథ నచ్చింది. చేసేశాను. ఈ సినిమా కోసం నేను చేసిన పెద్ద హోమ్ వర్క్ ఏంటంటే.. తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) సినిమాలు, ఇంటర్వ్యూలు అన్నీ తిరగేశాను. అలాగని ఇమిటేట్ చేయాలనుకోలేదు. ► నాలో తాతగారి పోలికలు ఉన్నాయి అని అందరికీ తెలుసు. అదృష్టవంతుడిని. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మేకప్ వేసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని నేనే నమ్మలేకపోయా. ‘మహానటి’లో చైతూని(నాగచైతన్య) చూసినప్పుడు భలే నచ్చింది. ‘గూఢచారి’లో సుప్రియ నటన చూసి షాక్ అయ్యాను. బాగా చేసింది. ► బీరం సుధాకర్‌రెడ్డిగారు ఇంతకుముందు ఫైనాన్సియర్‌గా చేశారు. పూర్తిస్థాయి నిర్మాతగా తొలి సినిమా ఇది. మార్కెటింగ్ కూడా బాగా చేశారు. చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో చేశాం. శేఖర్ చంద్రతో పని చేయడం ఫస్ట్ టైమ్. థ్రిల్లర్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. 3 పాటలుంటాయి. చాలా బాగా ఇచ్చాడు. కీరవాణిగారి స్టైల్ కనిపించింది. ► ‘ఇదం జగత్’ కూడా రిలీజ్‌కు రెడీ అయింది. ఆ సినిమా దర్శకుడు అనిల్ శ్రీకంఠం కొత్తవాడే. బ్రదర్, సిస్టర్ కాన్సెప్ట్‌తో ఓ సినిమా చేస్తున్నాను. -
రానా కథ చెబితే...
ఓ సినిమాలో బ్యాగ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ఎలా అవుతుంది? అంటే కొన్ని చిత్రాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటున్నారు ‘సుబ్రహ్మణ్యపురం’ టీమ్. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేశ్‌బాబు వాయిస్ ఓవర్, సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రానికి రవితేజ వాయిస్, ఇదే రవితేజ నాని ‘ఆ’ చిత్రానికి ఇచ్చిన వాయిస్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో రానా చేరారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రకథను నడిపించటానికి తన వాయిస్‌తో నడుం కట్టారు రానా. సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంతోశ్ జాగర్లమూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతోంది. ‘‘భగవంతుడు ఉన్నాడా? లేదా? అనేది మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం లేని మనిషి భగవంతునిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణ అని, యస్పీబీ పాడిన థీమ్ సాంగ్ ఓ హైలైట్ అని, రానా వాయిస్ ఓ ఎస్సెట్ అని కూడా చెప్పారు. -
సెన్సార్ పూర్తిచేసుకున్న‘సుబ్రహ్మణ్యపురం’!
అక్కినేని హీరో సుమంత్ కొత్త కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరోకు గతకొంతకాలం పాటు సరైన విజయం దక్కలేదు. రీసెంట్గా ‘మళ్లీరావా’తో ఫామ్‌లోకి వచ్చి.. వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు. తాజాగా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. మొత్తంగా 132నిమిషాల వ్యవధితో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదలచేస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. సుమంత్ జర్నలిస్ట్‌గా నటిస్తున్న ‘ఇదంజగత్’ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. It's U/A for @iSumanth's supernatural thriller #SubramanyaPuram with crisp runtime of 132 mins. Movie is releasing on Dec 7th. Produced by #BeeramSudhakaraReddy Directed by #SanthosshJagarlapudi@YoursEesha @MadhuraAudio pic.twitter.com/BAGL2dE8NO — BARaju (@baraju_SuperHit) 24 November 2018 -
వైరల్ అవుతున్న ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్!
‘మళ్లీరావా’ లాంటి క్లాస్ హిట్ తరువాత సుమంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టిన సుమంత్.. రూట్ మార్చి విభిన్న కథలతో ప్రయోగం చేస్తున్నాడు. ఇదంజగత్, సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాలతో మళ్లీ సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేమంతా భగవంతున్నే సర్చ్ చేస్తాము.. కానీ ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు’ , ‘గెలవడానికి ఆ భగవంతుడి సహాయం కావాలని మేము నమ్ముతాం.. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు’ లాంటి డైలాగ్‌లతో ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఆ ఊరు, గుడి, రహస్యం అంటూ మంచి ఇంట్రెస్ట్‌ను కలిగించేలా కట్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈషారెబ్బ కథానాయికగా నటించగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్ రెస్పాన్స్
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. విజయదశమి కానుకగా సోషల్‌మీడియాలో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. భక్తి ప్రధాన ఇతివృత్తంతో సాగే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంటుంది. నా సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది.. అని తెలిపారు. నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవై ఐదవ చిత్రమిది. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. తాజాగా విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగారు ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించారు. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాం.. అని అన్నారు. -
సూపర్ థ్రిల్లర్
సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓవర్సీస్ (భారతదేశం బయట మార్కెట్) బిజినెస్ కంప్లీట్ అయిపోయి ఆసక్తిని పెంచుతోంది సుమంత్ లేటెస్ట్ సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. కంట్రీసైడ్ పిక్చర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్నాం. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం లాస్ట్ అర్ధగంటలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఫ్యాన్సీ రేట్‌కు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోవడం హ్యాపీగా ఉంది. సుమంత్ కెరీర్ బెస్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: ఆర్.కె.ప్రతాప్. -
‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్‌లుక్
మళ్ళీరావా సినిమాతో సక్సెస్‌ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరోగా సుమంత్ వరుస సినిమాలో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే ఇదం జగత్ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసిన సుమంత్ మరో సినిమా సుబ్రహ్మణ్యపురం ప్రమోషన్‌ను కూడా ప్రారంభించారు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సుమంత్ తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతమందిస్తున్నారు. "To believe or not to believe" #Subrahmanyapuram . Here's the first look. Shoot almost halfway thru. Due for release this November... pic.twitter.com/eeH51PkjM6 — Sumanth (@iSumanth) 1 July 2018