
‘పెళ్లికూతురే పెళ్లికొడుకును లేపుకెళ్లడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా’... కమెడియన్ ప్రియదర్శి.‘పెళ్లే కదా ఆగిపోయింది. వాళ్లు ఆగిపోలేదు కదా’.. నటుడు నాజర్ ‘మన హార్ట్‌తో మనం కనెక్ట్ అయితే మనకేమొస్తదే.. నువ్వు ఒక అబ్బాయితో కనెక్ట్ అవ్వాలి.. నేను బోలెడంత మంది అమ్మాయిలతో కనెక్ట్ అవ్వాలి’.. హీరోయిన్ అమైరా దస్తూర్‌తో హీరో సందీప్ కిషన్. సూపర్‌స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన తొలిచిత్రం ‘మనసుకు నచ్చింది’లోని డైలాగ్స్ ఇవి.
సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్. పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేశారు. ట్రైలర్‌లోని డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించింది. రాధన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నాం. ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా.