సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్ విడుదల చేశారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాము. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాము. హిట్ కొట్టాలని, థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్ కి మంచి పేరు తెచ్చిపెడతా.
అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా... నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి... తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం" అన్నారు. ఈ కార్యక్రమంలో మాటల రచయిత సామ్రాట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రీ, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment