‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’తో అస్సలు సంబంధం లేదు
‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’తో అస్సలు సంబంధం లేదు
Published Sun, Nov 24 2013 1:26 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM
‘ఫొటోలు చేతపట్టుకుని చెన్నయ్‌లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజుల్ని మరిచిపోలేన’ని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు యువ కథానాయకుడు సందీప్‌కిషన్. ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరి, గుండెల్లో గోదారి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. త్వరలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సందీప్.. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
నువ్వు జ్యోతిక అన్నయ్య ఏంటని నవ్వారు...
మా నాన్నగారు ఓ సాధారణ ఉద్యోగి. అమ్మ.. ఆలిండియా రేడియోలో ఇంజినీర్. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మామయ్య చోటా కె.నాయుడు. ఆయన నన్ను సిఫార్సు చేయాలన్నా... ముందు నా దగ్గర విషయం ఉండాలి కదా. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి ఫొటోలు పట్టుకొని చెన్నయ్‌లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. ‘భద్ర’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారని తెలియగానే.. ‘హీరోయిన్ అన్నయ్య పాత్రయినా దొరక్కపోతుందా’ అని ట్రై చేశా. ‘నువ్వు జ్యోతిక అన్నయ్య ఏంటి?’ అని అందరూ నవ్వారు. అలాంటి అవమానాలు ఎన్నో.
ఆ రోజుల్లో నాతో పాటు అవకాశాల కోసం తిరిగిన వాళ్లు ఇంకా అదే పనిలో ఉన్నారు. నాపై మాత్రం నిర్మాతలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇదంతా నా అదృష్టం. ఇప్పటివరకూ తొమ్మిది సినిమాలు చేశాను. అన్నింటిలోనూ మంచి పాత్రలే చేశాను. కానీ సోలో హీరోగా చెప్పుకోదగ్గ సినిమా మాత్రం చేయలేదు. ఆ లోటు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తీర్చేసింది. కథ ఆద్యంతం రైల్లో నడుస్తుంది. అందుకే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేశాం. అంతేతప్ప ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ సినిమాకు, దీనికీ అస్సలు సంబంధం లేదు.
ఓ పెయింటింగ్‌లా మలిచారు...
మామయ్య చోటా కె.నాయుడు కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇందులో హీరోని నేను కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. కథను ప్రేమించి, ఈ చిత్రాన్ని ఓ పెయింటింగ్‌లా మలిచారు. దర్శకుడు గాంధీ వయసులో చిన్నవాడైనా... అనుభవం ఉన్న దర్శకునిగా చిత్రాన్ని తెరకెక్కించారు. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది.
అలా చేస్తే జనాలు కూడా నమ్మరు
ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం తాపత్రయపడతాను. అనవసరపు ఆర్భాటాలకు వెళ్లడం నాకూ, నిర్మాతలకు కూడా శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఓ వందమందిని కొట్టేశానంటే జనాలు కూడా నమ్మరు. అందుకే నా ఇమేజ్‌కి, వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్నాను. డి ఫర్ దోపిడి, డి.కె బోస్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘రారా కృష్ణయ్య’ చిత్రం నిర్మాణంలో ఉంది.
Advertisement
Advertisement