నేను కూడా లవ్ మ్యారేజే చేసుకుంటా! | i am love marriage says Sandeep Kishan | Sakshi
Sakshi News home page

నేను కూడా లవ్ మ్యారేజే చేసుకుంటా!

Published Wed, May 6 2015 10:54 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

నేను కూడా లవ్ మ్యారేజే చేసుకుంటా! - Sakshi

నేను కూడా లవ్ మ్యారేజే చేసుకుంటా!

 మంచి కథలతో, వేగంగా సినిమాలు చేయాలని అనుకుంటున్నారు హీరో సందీప్ కిషన్. ఈ నెలలో ‘టైగర్’గా జనం ముందుకు  రానున్న ఈ యువ హీరో గురువారం పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.
 
 ఐదేళ్ల కెరీర్‌ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
 ‘ప్రస్థానం’లో నెగటివ్ క్యారెక్టర్‌తో కెరీర్ మొదలుపెట్టా. సో... ఒక మైనస్‌తో మొదలుపెట్టి హీరోగా పాజిటివ్‌గా మారా. ఒక సినిమా విజయం అనేది నా చేతుల్లో ఉండదు. కానీ, చూసినవాళ్లందరూ ‘సందీప్ కిషన్ మంచి కథలు ఎంపిక చేసుకుంటాడు’ అనుకుంటున్నారు. అదే నా సక్సెస్.

 కానీ, కమర్షియల్ హీరోగా ఎదిగాననుకుంటున్నారా?
 ఒకప్పుడు నాతో సినిమాలు తీయడానికి దర్శకులు ఉండేవాళ్లు కానీ, నాకు మార్కెట్ లేదని నిర్మాతలు ముందుకొచ్చేవాళ్లు కాదు. ఆ స్థాయి నుంచి నాతో సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అయ్యే స్థాయికి చేరుకున్నా. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బీరువా’, ఇప్పుడు ‘టైగర్’ - ఇలా పెద్ద బేనర్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నా.

 ‘వెంకటాద్రి...’తో పెరిగిన గ్రాఫ్ మళ్లీ తగ్గినట్లుంది?
 ‘వెంకటాద్రి’తో గ్రాఫ్ పెరిగిన మాట వాస్తవమే. ‘రారా కృష్ణయ్య, జోరు’ కొంచెం నిరాశపరిచాయి. కానీ, ‘బీరువా’ హెల్పయ్యింది. జయాపజయాలు పక్కనపెడితే నాది ఏదీ ‘బ్యాడ్ మూవీ’ కాదు.

 నటుడిగా మంచి మార్కులు వేయించుకున్న మీరు వ్యక్తిగతంగా మాత్రం తలబిరుసుతనం అని కొంతమందితో అనిపించుకుంటున్నారు. ఎందుకలా?
 ఏమోనండీ. ఈ మాటలు నా వరకూ వచ్చాయి. నేను కూడా ఆశ్చర్యపోతుంటా. లొకేషన్లో నేనెవరితో అయినా గొడవపడినట్లు వార్తలు వచ్చాయా? పోనీ విడిగా ఎవరితోనైనా తేడాగా ప్రవర్తించానా? లేదే? మరి, నా గురించి ఎందుకలా అనుకుంటున్నారో?  నేనంటే పడనివాళ్లెవరైనా అలా ప్రచారం చేస్తున్నారేమో! నాతో మాట్లాడేవాళ్లకి నేనేంటో తెలుసు.
 
 పోనీ.. మీ తీరేమైనా మార్చుకోవాలనుకుంటున్నారా?
 నేనవరికీ ఏమీ చెడు చేసింది లేదు. ఇంకొకరి మెప్పు కోసం ‘ఎక్స్‌ట్రా స్వీట్’గా బిహేవ్ చేయడం మొదలుపెడితే, అది నటన అని తెలిసిపోతుంది. అందుకని నేను నాలా ఉంటాను. అప్పుడు లాంగ్ రన్‌లో అయినా ‘మంచి’ అనిపించుకుంటాను. అదే నటిస్తే.. ఎప్పటికీ చెడ్డవాడిగా మిగిలిపోతా.
 
 సినిమాల్లో అన్ని విషయాల్లో ఇన్‌వాల్వ్ అవుతారట?
 లేదండి. ‘జోరు’ దర్శకుడితో రెండు సినిమాలు, ‘జెమినీ’ కిరణ్ గారి బేనర్లో రెండు సినిమాలు, రాజ్ - డి.కెలతో రెండు సినిమాలు చేశాను. నేను కనుక లొకేషన్లో అనవసరంగా ఇన్‌వాల్వ్ అయితే, వాళ్లు మళ్లీ నాతో ఎందుకు సినిమాలు చేస్తారు? నేను సినిమాలు చేసేదంతా యంగ్ టీమ్‌తో. దర్శకుడు ఏదైనా సీన్ చెప్పి, బాగుందా అనడిగితే, నాకు బాగాలేకపోతే ‘లేదు’ అని చెప్పేస్తా. నా సినిమా విషయంలో నా కళ్లెదుట తప్పు జరిగితే చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే అది నా సినిమా. నచ్చనిది నచ్చలేదని చెప్పేస్తా. అలా నిజాయతీగా మాట్లాడటం నచ్చలేదేమో? కానీ, నేను చెప్పిందే చేయాలని ఎప్పుడూ పట్టుబట్టలేదు.
 
 ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
 నేను చేసిన ‘టైగర్’ విడుదలకు సిద్ధమైంది. ఇందులో నాది ఫుల్ మాస్ కారెక్టర్. ఇంటెలిజెంట్ మూవీ. మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేస్తున్నా. రెజీనాతో నాకిది మూడో సినిమా. ఇంకా ఓ పెద్ద దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేయనున్నా.
 
 ఒకే నాయికతో మూడు సినిమాలు చేస్తే ‘ఏదో ఉంది’ అని చాలామంది అనుకుంటారు కదా?
 నాకో బాయ్‌ఫ్రెండ్ ఎలానో రెజీనా కూడా అంతే. కరెక్ట్‌గా చెప్పాలంటే రెజీనా నాకు అబ్బాయిలాంటిది. రకుల్, రెజీనా, అల్లు శిరీష్, రాహుల్ రవీంద్రన్.. వీళ్లంతా నాకు మంచి స్నేహితులు.
 
 మనోజ్, ‘అల్లరి’ నరేశ్.. ఇలా యువహీరోలంతా పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీరు?
 నా పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉంది. మా అమ్మా నాన్నలది. పెద్దమ్మ, పెద్దనాన్న, మామయ్యలది లవ్ మ్యారేజే. అందుకే నేను కూడా లవ్ మ్యారేజే చేసుకుంటా. పెళ్లనేది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. నేను కనుక ప్రేమలో పడితే.. ప్రపంచానికి చెబుతా.
 
 ఫైనల్‌గా పుట్టినరోజు ప్లాన్స్ గురించి?
 అమ్మానాన్న, చెల్లి చెన్నై నుంచి వచ్చారు. వాళ్లక్కడే ఉంటారు. వాళ్లతో స్పెండ్ చేస్తా. నా ప్రతి పుట్టినరోజుకూ ఏదైనా సినిమా చూడటం అలవాటు. నాదనే కాదు.. ఎవరిదైనా చూస్తా. నాకు బాధ అనిపించినా సినిమా చూస్తా. సంతోషం అనిపించినా చూస్తా. ఫీలింగేదైనా సినిమాతో ముడిపెట్టుకుంటా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement