దానికి వయసుతో పనిలేదు
స్త్రీని బానిసగా చూసేవారికి కనువిప్పు కలిగించే చిత్రం 36 వయదినిలే. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో జ్యోతిక నటించారు. మహిళా లోకానికి స్ఫూర్తి నిచ్చే పాత్రలో నటించిన చిత్రం 36 వయదినిలే. జ్యోతిక దశాబ్దం క్రితం ప్రముఖ హీరోయిన్‌గా విరాజిల్లారు. ఆమె నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకుని అర్ధాంగి గాను, ఇద్దరు పిల్లలకు తల్లిగాను తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ సుమారు తొమ్మిదేళ్ల తరువాత మళ్లీ తనను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన కళామతల్లి సేవకు సిద్ధం అయ్యారు. ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదు అంటున్న జ్యోతిక మనోభావాలు ఏంటో చూద్దాం.
ప్రశ్న : మళ్లీ నటనపై దృష్టి సారించడానికి కారణం?
జవాబు: నా కూతురు దియా మూడో తరగతి చదువుతోంది. కొడుకు దేవ్‌ను ఎల్‌కేజీలో చేర్చాను. వీరిద్దరి పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ వారి మొత్తం పనులు చూసుకుంటున్నాను. ఇలా తల్లిగా, ఇల్లాలిగా జీవిస్తున్న నన్ను ఈ 36 వయదినిలే చిత్రం మళ్లీ నటించేలా చేసింది.
ప్రశ్న : ఈ విషయంలో మీ కుటుంబ సభ్యుల ఆదరణ ఏ మేరకు ఉంది?
జవాబు: మా అత్తామామల్ని నేను అమ్మా నాన్న అనే పిలుస్తాను. వారు జో ఈ చిత్రం చేయొద్దు అని అనలేదు. అలాగే నెగటివ్‌గా ఒక్కమాట కూడా అనలేదు. నాన్న పిల్లల్ని స్కూలుకు తీసుకెళతారు. అమ్మ వారికి భోజనం సిద్ధం చేస్తారు. ఇలా కుటుంబమంతా నాకు అండగా నిలిచారు. అందుకు నా కుటుంబానికి నేను రుణపడి ఉన్నాను.
ప్రశ్న: మీకు మార్గదర్శకులైన దర్శకులెవరు?
జవాబు: నన్ను నటిగా పరిచయం చేసిన దర్శకుడు ప్రియదర్శన్. నాకు నటన గురించి నేర్పించిన దర్శకుడు వసంత్. నేను సూర్య కలసి నటించిన తొలి చిత్ర దర్శకుడు ఆయనే. చాలా విషయాలు కూర్చోబెట్టి మరి నేర్పించారు. అలాగే నా కెరీర్‌లో ముఖ్యమైన చిత్రం మొళి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రాధామోహన్ వారందరూ మార్గదర్శకులే.
ప్రశ్న: కుటుంబాన్ని, నటనా బాధ్యతల్ని ఎలా నిర్వర్తించగలిగారు?
జవాబు : నిజం చెప్పాలంటే ఇదో మంచి అనుభవం. 36 వయదినిలే చిత్రం అధికభాగం షూటింగ్ చెన్నైలోనే నిర్వహించాం. అయితే ప్రారంభించింది మాత్రం ఢిల్లీలో. తుది ఘట్ట సన్నివేశాలు అక్కడే చేశాం. మిగిలిందంతా చెన్నైలోనే చేశాను. క్రిస్మస్, న్యూ ఇయర్ మినహా గ్యాప్ లేకుండా షూటింగ్ చేశాం. ఉదయం ఏడు గంటలకు షూటింగ్ మొదలైతే రాత్రి 11 గంటల వరకు సాగుతుంది. ఆదివారం కూడా షూటింగ్ చేశాం. చిత్రం కోసం యూనిట్ అంతా సహకరించారు.
ప్రశ్న: 36 వయదినిలే చిత్రం చేయడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జవాబు: చాలా వైవిధ్యభరిత కథా చిత్రం. ఏదో నటించాలన్న ఆలోచనతో ఈ చిత్రం చేయలేదు. 36 వయదినిలే చిత్రమే స్పెషల్. చిత్రంలో పని చేసిన మగవారంతా ఈ చిత్ర కథను నమ్మారు. వారి భార్యలు కూడా వారికి సెట్‌లో సహాయం చేశారు.
ప్రశ్న: మీలో ఆత్మవిశ్వాసం అధికం అనుకుంటా?
జవాబు: అవును. అందుకు కారణం మా అమ్మనే. చిన్నతనం నుంచి నన్ను, నా తమ్ముడిని అందరినీ ఒకేలా పెంచారు. ఆమె పెంపకమే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
ప్రశ్న: 36 వయదినిలే స్త్రీ శక్తి ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమా?
జవాబు: అవును. ఈ చిత్రం విడుదలైన తరువాత ప్రతి మగవాడు స్త్రీ శక్తి గురించి తెలుసుకుంటాడు. సమాజంలో మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పడానికి మగవారు ముందుకు వస్తారు.