రే... నువ్వు అత్యంత అద్భుతమైన వ్యక్తివి! | Sussanne Khan Adorable Wishes To Hrithik Roshan On His Birthday | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోపై మాజీ భార్య ప్రశంసలు!

Jan 10 2020 11:19 AM | Updated on Jan 10 2020 12:06 PM

Sussanne Khan Adorable Wishes To Hrithik Roshan On His Birthday - Sakshi

‘అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.. భార్యాభర్తలుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కలకాలం కలిసి ఉంటాం’... ఇటీవలి కాలంలో విడాకులు తీసుకున్న అరడజనుకు పైగా బాలీవుడ్‌ జంటలు చేసిన ప్రకటన ఇది. అయితే అందులో కొంతమంది మాత్రమే ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉంటారు బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌.. ఆయన మాజీ భార్య సుసానే ఖాన్‌. హృతిక్‌, సుసానే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాల్యం నుంచి స్నేహితులుగా మెలిగిన హృతిక్‌​- సుసానే 2000 సంవత్సరంలో డిసెంబర్‌ 20న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు హ్రేహాన్‌, హ్రిధాన్‌ ఉన్నారు. బీ-టౌన్‌ జంటల్లో ఎంతో అన్యోన్య దంపతులుగా పేరొందిన వీరి కాపురంలో చిచ్చుకు ఓ స్టార్‌ హీరోయిన్‌ కారణమనే వార్తలు గతంలో ప్రచారమయ్యాయి. 

ఈ నేపథ్యంలో 2013లో దూరమైన ఈ జంట... 2014 నవంబర్‌లో విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు.  అయితే.. పిల్లల కోసం వీరిద్దరూ తరచుగా కలుస్తూ ఉంటారు. పిల్లల పుట్టినరోజుల వంటి ప్రత్యేక సమయాల్లోనే గాకుండా వారితో కలిసి హాలిడే ట్రిప్పులకు సైతం వెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. ఇక హృతిక్‌ సంబంధించిన ప్రతీ విషయంలో ప్రత్యక్షంగానైనా లేదా పరోక్షంగానైనా సుసానే ప్రమేయం ఉండనే ఉంటుంది. అంతేకాదు మాజీ భర్త వ్యక్తిత్వాన్ని ప్రశంసించడంలోనూ సుసానే ముందే ఉంటారు. 

ఇక ఈరోజు హృతిక్‌ పుట్టినరోజు సందర్భంగా.. బెస్ట్‌ డాడీ అంటూ సుసానే ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. ‘ రే... నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన వ్యక్తివి నువ్వు. మున్ముందు నీ జీవితం ఎంతో గొప్పగా సాగుతుంది’ అని సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమారులతో కలిసి ఉన్న హృతిక్‌ ఫొటోలతో పాటు వీడియోలు షేర్‌ చేసి... బెస్ట్‌ డాడీ, ఫిలాసఫర్‌ అని పేర్కొన్నారు. బహుశా ఇందుకేనేమో... హృతిక్‌- సుసానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారంటూ కొన్నాళ్ల క్రితం వదంతులు వ్యాపించాయి. ఏదేమైనస్పటికీ సుసానేను.. హృతిక్‌ మాజీ భార్య అనే కంటే హృతిక్‌ బెస్ట్‌ఫ్రెండ్‌ అని పేర్కొంటే బాగుంటుందేమో కదా.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement