
ఈ ఫొటో చూసి ‘నో’ అన్నారు!
ఏ సూపర్ స్టార్ అయినా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మామూలు వ్యక్తే. ఎన్నో తిరస్కరణలకు గురై, ఎలాగోలా అవకాశాలు సంపాదించుకుని, చివరికి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటారు. అదృష్టవంతులకు ఈ పాట్లు ఉండవనుకోండి. ఆ సంగతలా ఉంచితే... అష్టకష్టాలు పడి పైకొచ్చిన నటుల్లో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. ముందు చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోగా ఎంటరై, ఆనక ‘సూపర్ స్టార్’ అనిపించుకున్నారు. అవకాశాలు సంపాదించుకోవడం కోసం ఆయన తన ఫొటోలను ‘ట్యాలెంట్ హంట్’ కోసం పంపించేవారట. అలా అప్పట్లో పంపించిన ఓ ఫొటోను ఇప్పుడు అమితాబ్ బయటపెట్టారు.
‘‘ఓ ట్యాలెంట్ హంట్‌లో తిరస్కరణకు గురైన నా ఫొటో ఇది. ఈ ఫొటోని చూశాక, అప్పట్లో వాళ్ళు నన్ను తిరస్కరించడం పెద్దగా ఆశ్చర్యం అనిపించడం లేదు కదూ’’ అని ఆయన పేర్కొన్నారు. తిరస్కరణకు గురయ్యాక, ఆయనలో ఓ పట్టుదల ఏర్పడింది. కోల్‌కతాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని, అవకాశాల కోసం పూర్తిగా ముంబయ్‌లో ఉండటానికి డిసైడ్ అయ్యారు. ‘‘ముంబయ్‌లో అడుగుపెట్టాక రాజేశ్ ఖన్నాని చూసినప్పుడు అలాంటివాళ్లు ఉండగా మనలాంటివాళ్లకు అవకాశాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది అనిపించింది’’ అని ఆనాటి విషయాలను తల్చుకున్నారు అమితాబ్.
చివరికి 1968 ఫిబ్రవరి 15న ‘సాత్ హిందుస్తానీ’ సినిమా ఆడిషన్స్ కోసం రచయిత - దర్శకుడు ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ ఆఫీసుకు వెళ్లారాయన. ‘‘ఆ సినిమాలో ఓ పాత్ర కోసం ఆడిషన్స్ చేశారు. నన్ను సెలక్ట్ చేశారు. ఆ విధంగా నటుడిగా నాకు ఎంట్రీ దొరికింది. ఇది జరిగి 47 ఏళ్లు అయ్యింది’’ అని అమితాబ్ పేర్కొన్నారు.