మిల్కీబ్యూటీ తమన్నా సియాన్ విక్రమ్‌తో పాండిచ్చేరిలో రొమాన్స్ చేస్తోంది. నటుడు విక్రమ్ ఏక కాలంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ధ్రువనక్షత్రం. ఆ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక రెండో చిత్రం స్కెచ్ (ఈ టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు). వాలు చిత్రం ఫేమ్ విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విక్రమ్‌కు జంటగా నటి తమన్నా తొలిసారిగా జత కడుతున్నారు.
ఈ చిత్ర షూటింగ్ స్థానిక పెరంబూర్ సమీపంలోని బిన్నివిుల్లులో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో నెల రోజుల పాటు జరుపుకుంది. ఈ సెట్‌లో విక్రమ్‌కు సంబంధించిన ముఖ్య సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ నెల ఒకటవ తేదీన చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో మకాం పెట్టింది. అక్కడ విక్రమ్, తమన్నాలకు సంబంధించిన రొమాన్స్ సన్నివేశాలను సముద్రతీరంలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది.
పాండిచ్చేరిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరువాత విక్రమ్, తమన్నా ఆడి పాడే పాట చిత్రీకరణ కోసం బ్యాంకాంగ్ పయనానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్ర కథ ఉత్తర చెన్నై నేపథ్యంలో జరుగుతుందట. జెమిని చిత్రంలోని మాస్ పాట తరహాలో విక్రమ్ ఈ చిత్రంలోనూ దుమ్మురేపనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ రెండు చిత్రాలను పూర్తి చేసి హరి దర్శకత్వంలో సామి–2కు విక్రమ్ రెడీ అవుతున్నారన్నది గమనార్హం. ఇందులో ఆయనతో మరో సారి చెన్నై చిన్నది త్రిష జత కట్టనున్నారు.