
సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్శల్’పై వైద్యులు కన్నెర్ర చేశారు. ఈ సినిమాను బహిష్కరిస్తున్నట్టు తమిళ వైద్యులు ప్రకటించారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. తమను కించేపరిచేలా సినిమా తీశారని మండిపడ్డ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా పైరసీ లింకులను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నిర్ణయించారు. ‘మెర్శల్’పై మౌనపోరాటం చేస్తామని ప్రకటించారు.
‘ఈ వివాదంపై మీడియా, కోర్టును సంప్రదించకూడదని నిర్ణయించాం. ఎందుకంటే మేము కోర్టుకెళితే సినిమాకు మరింత పబ్లిసిటీ వస్తుంది. దీనికి బదులుగా ఈ సినిమా లింకులను వెబ్ పేజీల్లో పోస్ట్ చేస్తాం. దీంతో సినిమా కలెక్షన్లు తగ్గుతాయి. అప్పుడు ఈ సినిమా తీసినవాళ్లు కళ్లుతెరుస్తార’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ రవిశంకర్ అన్నారు. కాగా, ‘మెర్శల్’ ను బహిష్కరించాలని తమ సభ్యులకు, వారి కుటుంబసభ్యులకు ఇంటర్నెట్ ద్వారా ఐఎంఏ సందేశాలు పంపింది.
మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో డిజిటల్ ఇండియా, జీఎస్టీ అమలుపై డైలాగులు కూడా వివాదస్పదమయ్యాయి. ఈ రెండు అంశాలపై అసత్య సమాచారం ఇచ్చారని బీజేపీ మండిపడింది. ఈ డైలాగులు తొలగించాలని డిమాండ్ చేసింది. కాగా, ఈనెల 18న విడుదలైన ‘మెర్శల్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. తమిళనాడులో రికార్డులు సృష్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment