
కాకతీయుడు అత్యంత శక్తిమంతుడు
‘‘నా కెరీర్‌కి మేలి మలుపుగా నిలిచే సినిమా ఇది. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. నా పాత్రను భిన్నంగా, అత్యంత శక్తిమంతంగా దర్శకుడు సముద్ర తీర్చిదిద్దుతున్నారు’’ అని తారకరత్న అన్నారు. ఆయన కథానాయకునిగా వి.సముద్ర దర్శకత్వంలో లగడపాటి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘కాకతీయుడు’. ఈ చిత్ర విశేషాలు తెలియజేయడానికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తారకరత్న మాట్లాడారు. నిర్మాత శ్రీనివాస్ తనకు పదేళ్ల నాటి మిత్రుడనీ, తొలి సినిమా తనతోనే చేయాలనే పట్టుదలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తారకరత్న చెప్పారు.
తన ‘ఒకటో నంబర్ కుర్రాడు’ స్థాయిలో పాటలు కుదిరాయని ఆయన ఆనందం వెలిబుచ్చారు. ‘తారకరత్నతో నా రెండో సినిమా ఇది. శిల్ప, యామిని ఇందులో కథానాయికలు. కొత్తవారైనా చక్కగా నటిస్తున్నారు. వినోద్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నారు. గుంటూరు, వినుకొండ పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపాం’’అని సముద్ర చెప్పారు. ‘‘80 శాతం చిత్రీకరణ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని త్వరలోనే పూర్తి చేసి, వచ్చే నెలలో పాటల్ని, ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మల్కార్ శ్రీనివాస్, కెమెరా: సి.సహదేవ్, సంగీతం: ఎస్.ఆర్.శంకర్.