
జోరు తగ్గని ఖైదీ.. పెరిగిన కలెక్షన్లు
తొమ్మిదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. అమెరికాలో తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా అదే జోరు కొనసాగిస్తోంది. యూఎస్లో శుక్రవారం కంటే శనివారం ఎక్కువ వసూళ్లు రాబట్టింది. శుక్రవారం 1,39,547 డాలర్లు వసూలు కాగా, శనివారం 2,52,513 డాలర్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు. యూఎస్లో శనివారం నాటికి ఖైదీ నంబర్ 150 సినిమా మొత్తం 13.11 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్వీట్ చేశాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా కలెక్షన్లు రావచ్చని అభిప్రాయపడ్డాడు.
తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఖైదీ నంబర్ 150 సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ హిట్గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా చిరంజీవి తాజా సినిమా ఆ రికార్డ్ను దాటి కొత్త చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఒక్క రోజులో 47 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిరు స్టామినా చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.