
నా వద్ద తోక జాడించడం కుదరదు
నా వద్ద తోక జాడించడం ఎవరి వల్లా కాదంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీలో దైర్యం మాత్రమే కాదు ఇంకేదో ఉంది. అదేమిటో చూద్దాం. తాప్సీకి కోలీవుడ్‌లో తొలి చిత్రం ఆడుగళం విజయవంతమైన చిత్రంగా అమరింది. అయినా ఆమె కెరీర్ ఇక్కడ హీట్ ఎక్కలేదు. అవకాశాలు అడపాదడపానే రావడం గమనార్హం. ఆ మధ్య లారెన్స్ సరసన నటించిన కాంచన-2 చిత్రం విజయం సాధించడంతోపాటు తాప్సీకి నటనలో మంచి మార్కులు పడ్డాయి. దీంతో తనకు కోలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది అనుకున్న వారు లేకపోలేదు.
ఊహించినట్లు గానే ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వంలో వైరాజావై చిత్రంతో పాటు సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు సరసన ఖాన్ చిత్రంలో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే వైరాజావై చిత్రం విడుదలైనా తాప్సీకి ఏమంత పేరు రాలేదు. ఇక ఖాన్ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది తాప్సీని చాలా నిరాశ పరచిందనే చెప్పాలి. నటిగా తాప్సీ పరిస్థితి అలా ఉంటే వ్యక్తిగతంగా తాను చాలా బలమైన వ్యక్తినంటోందామె. ఆ మధ్య హిందీలో అక్షయ్‌కుమార్ సరసన బేబి అనే చిత్రంలో నటించింది.
అందులో పోరాట సన్నివేశాల్లో కూడా నటించింది. అందుకు తగిన శిక్షణ తీసుకుందట. అయితే ఆ చిత్రం తరువాత కూడా తను ఆ శిక్షణను కొనసాగిస్తోందట. అంతే కాదు అదనంగా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా శిక్షణ పొందిందట. అందువల్లే తాప్సీ ఎక్కడికైనా ఒంటరిగానే వెళుతుంది.చాలా మంది హీరోయిన్లు తమకు రక్షణగా కొందర్ని వెంట తెచ్చుకుంటుంటారు. ఈ విషయాన్ని తాప్సీ వద్ద ప్రస్తావిస్తే ‘నేనెక్కడికైనా ఒంటరిగానే వెళ్తాను. ఎలాంటి సమస్య ఎదురైనా ఎదుర్కొనే సత్తా నాకుంది. నా ముందు ఎవరూ తోక జాడించలేరు’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది.