మేమిద్దరం భోజన ప్రియులం!
‘‘నేను చేసే సినిమాలు... నా తల్లిదండ్రులు, అత్తమామలు, నా భర్త... ఇలా నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేంత ప్లెజెంట్‌గా ఉండాలి. అలాంటి పాత్రలే ఇక నుంచి చేస్తా’’ అంటున్నారు నటి స్నేహ. ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ... కె.ఎస్.రామారావుతో కలిసి నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌కి జోడీగా నటించారామె. వివాహానంతరం స్నేహ చేసిన సినిమా ఇదే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరును తెచ్చిపెట్టిందని, కావల్సినన్ని ప్రశంసల్ని అందిస్తోందని ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆనందాన్ని వెలిబుచ్చారు.
ఇంకా చెబుతూ- ‘‘ఇందులోని ‘గౌరి’ పాత్ర గురించి ప్రకాశ్‌రాజ్ చెప్పినప్పుడే ఈ సినిమాను మిస్ కాకూడదని నిశ్చయించుకున్నాను. ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ మొత్తం ప్రకాశ్‌రాజ్‌కే దక్కుతుంది స్వతహాగా నేను ఇంట్లో ఎలా ఉంటానో, అలాగే ఈ సినిమాలో కూడా బిహేవ్ చేశా. 36 ఏళ్ల యువతిగా నటించడం, డబ్బింగ్ ఆర్టిస్ట్ పాత్ర పోషించడం ఓ కొత్త అనుభూతినిచ్చింది. భవిష్యత్తులో నటించే తెలుగు సినిమాలో నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటా’’ అని తెలిపారు స్నేహ. మధుమాసం, రాధాగోపాళం, శ్రీరామదాసు, రాజన్న... తనకు మంచి పేరు తెచ్చిన సినిమాలనీ, తొలినాళ్ల నుంచి ఇలాంటి పాత్రలు చేయడానికే తాను ఆసక్తి కనబరిచానని, గ్లామర్ పాత్రలకు ప్రస్తుతం తాను దూరమని,
పాత్రలో పవిత్రత ఉంటే... ఏ పాత్రనైనా అంగీకరిస్తానని స్నేహ చెప్పారు. తన వైవాహిక జీవితం గురించి చెబుతూ- ‘‘మంచి కుటుంబానికి నేను కోడలినయ్యాను. నా భర్త ప్రసన్న నాకు మంచి ఫ్రెండ్ కూడా. ‘నా భార్య గౌరి పాత్ర చేయడం గర్వంగా ఉంది’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసుకున్నారు. అది చూడగానే చెప్పలేని ఆనందం కలిగింది. మేం ఇద్దరం భోజన ప్రియులమే. మంచి ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళతాం. అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం. ‘ఉలవచారు బిర్యాని’లోలా కుట్టి దోసెలంటే ఇంకా ఇష్టం’’ అని చెప్పారు స్నేహ. త్వరలో తన భర్త ప్రసన్న భాగస్వామ్యంతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా స్నేహ తెలిపారు.