అక్కడ కన్నా ముందే... ఇక్కడ!
‘ది జంగిల్ బుక్’... అడవిలో చిక్కుకుపోయిన మౌగ్లీ అనే పసిబాలుణ్ణి తోడేళ్ళ కుటుంబమంతా కలసి పెంచే ఈ కథ తెలియనివారూ, యానిమేషన్ చిత్రంగా చూడనివారూ ఉండరు. రుడ్యార్డ్ కిప్లింగ్ రాయగా ప్రపంచ ప్రసిద్ధమైన ఈ సాహస కథలకు డిస్నీ సంస్థ కొత్తగా ఇచ్చిన వెండితెర రూపం మరికొద్ది రోజుల్లో ఏప్రిల్ ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయ - అమెరికన్ అయిన 12 ఏళ్ళ నీల్ సేథీ ఈ చిత్రంలో ప్రధానపాత్ర మౌగ్లీని పోషిస్తున్నారు.
లైవ్ యాక్షన్‌తో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించిన జంతువులు, అటవీ వాతావరణంతో ఈ కథను ఇప్పుడు తెరకెక్కించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, కథాకథన విధానాలు దానికి తోడయ్యాయి. విశేషం ఏమిటంటే, ఎన్నేళ్ళయినా వన్నె తరగని ఈ కథా చిత్రం అమెరికా కన్నా ఓ వారం ముందుగానే మన దేశంలోని థియేటర్లలో రిలీజవుతోంది. ‘‘ఇండియాలోని ‘ది జంగిల్ బుక్’ అభిమానులకు మరెన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు ఉన్నాయి’’ అని డిస్నీ ఇండియాలోని ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. ‘ఐరన్ మ్యాన్’ ఫేమ్ జోన్ ఫేవ్‌రీ ఈ చిత్రానికి దర్శకుడు.
హిందీలో ప్రియాంకా చోప్రా... ఓంపురి... నానా పాటేకర్...
కాగా, ‘గాంధీ’ పాత్రధారి ఇండియాలోనూ ప్రసిద్ధుడైన బెన్ కింగ్‌స్లే, అలాగే బిల్ ముర్రే, స్కార్లెట్ జొహాన్‌సన్ తదితరులు ఈ చిత్రంలోని రకరకాల జంతువుల పాత్రలకు ఇంగ్లీషులో గళం అందించడం విశేషం. కాగా, హిందీ వెర్షన్‌లో కొండచిలువ పాత్ర ‘కా’కు ప్రియాంకా చోప్రా, ఎలుగుబంటి ‘బాలూ’ పాత్రకు ఇర్ఫాన్, తోడేలు ‘రక్ష’ పాత్రకు షెఫాలీ షా గాత్రదానం చేస్తున్నారు.
కాగా, కీలకమైన నల్ల చిరుత పాత్రకు ఇంగ్లీషులో బెన్‌కింగ్‌స్లే, హిందీలో ఓంపురి గాత్రధారులు. టైగర్ షేర్‌ఖాన్ పాత్రకు నానా పాటేకర్ హిందీలో జీవం పోస్తున్నారు. ‘జంగిల్ బుక్’లోని మౌగ్లీ, బాలూ, బఘీరా, షేర్‌ఖాన్ లాంటి పాత్రల చుట్టూ జరిగే సాహస కథలు భారతీయులకు చాలా ఇష్టం. అందుకే తగ్గట్లే ఇప్పుడీ సినిమా మన దగ్గర ముందుగా రిలీజ్ కావడం చెప్పుకోదగ్గ విశేషం.