
అప్పుడు నన్ను వేధించారు!
ప్రియాంకా చోప్రా తన చిన్నతనంలో అమెరికాలో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారట. దాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ప్రియాంక చెబుతూ - ‘‘అప్పుడు నాకు పదహారేళ్లు. అమెరికాలో చదువుకుంటున్నా. తోటి పిల్లలతో సరదాగా ఉంటూ, ఆడుతూ, పాడుతూ చదువుకుందామనుకున్న నాకు నిరాశే మిగిలింది. అక్కడి పిల్లలు నన్ను ‘బ్రౌనీ’ అని పిలవడం మొదలుపెట్టారు.
భారతీయులను అలా పిలుస్తారని నాకు అప్పుడే తెలిసింది. కానీ, భారతీయులంటే ఎందుకింత చిన్నచూపు అని కుమిలిపోయేదాన్ని. ‘నువ్వెక్కణ్ణుంచి వచ్చావో అక్కడికే వెళ్లిపో’ అని వేధించడం మొదలుపెట్టారు. పిరికిగా వెనక్కి వెళ్లిపోకూడదనుకున్నా. చాన్నాళ్లు భరించా. చివరకు చదువుని మధ్యలో ఆపేసి ఇండియా వచ్చేశా’’ అన్నారు.
అప్పట్లో చేదు అనుభవాన్ని మిగిల్చిన అదే అమెరికా, ఇప్పుడు తన మీద ప్రశంసల వర్షం కురిపిస్తోందని ప్రియాంక చెబుతూ- ‘‘అమెరికన్ టీవీ రియాల్టీ షో ‘క్వాంటికో’లో ఓ పవర్‌ఫుల్ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. నా నటన చూసి, అక్కడివాళ్లు ‘భేష్ ప్రియాంక’ అన్నారు. అది చాలు నాకు’’ అని ఉద్వేగంగా చెప్పారు.