అమెరికాలో ఒకటి గుడ్...మరొకటి బ్యాడ్!
దేశీ తార ప్రియాంకా చోప్రా అమెరికాన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా విదేశాల్లో బాగా పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’లో నటిస్తున్నారామె. ఈ షూటింగ్ కోసం అమెరికాలో ఎక్కువగా ఉంటున్నారు ప్రియాంక. అక్కడి టాక్ షోస్‌లో కూడా పాల్గొంటున్నారు. ఎలెన్ డిజినిరస్ నిర్వహించిన ఓ టాక్ షోలోనూ, చెల్‌సీ హ్యాండలర్స్ నిర్వహించిన మరో టాక్ షోలోనూ పాల్గొన్నారు. ఎలన్ నిర్వహించిన షోలో ప్రియాంక మాటలు చాలామందిని ఆగ్రహానికి గురి చేశాయి. చెల్‌సీ షోలో మాట్లాడిన మాటలు అభినందనలు తెచ్చిపెట్టాయి. ఆ విధంగా ఒక షో గుడ్.. మరో షో బ్యాడ్ నేమ్ తెచ్చింది.
షో ఆరంభంలో ఎలెన్ డిజినిరస్ కూల్‌గా ప్రియాంకకు ‘టకీలా’ (మద్యపానం) ఆఫర్ చేసి, ‘మా అమెరికన్లు ఎక్కువ తాగుతారు’ అన్నారు. ప్రియాంక టకీలా లాగించి, ‘మా ఇండియన్స్ కూడా చాలా తాగుతారు’ అన్నారు. దేశం కాని దేశంలో ఇండియా గురించి ప్రియాంక అలా కామెంట్ చేయడం చాలామందిని ఆగ్రహానికి గురి చేసింది. ఈ షోలో ప్రియాంక ఓవర్ యాక్షన్ చేశారనీ, అదంతా టకీలా ప్రభావమేనని ఆమెను నిందిస్తున్నారు. ఇక.. చెల్‌సీ హ్యాండలర్స్ షోలో ప్రియాంక మాట్లాడిన మాటలు బ్రహ్మాండం అంటున్నారు. ‘వీకెండ్స్‌లో మీరెక్కువగా ఇండియాలో షూటింగ్ చేయడానికి కారణం?’ అని చెల్‌సీ అడిగితే - ‘‘వాస్తవానికి అమెరికా వచ్చి నేను చెడిపోయా. మీకులా మాకు వీకెండ్స్ ఉండవు. ఏడు రోజులూ పని చేస్తాం. కానీ, అమెరికాలో వారంలో రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. నేనైతే మొదట్లో ఆశ్చర్యపోయా.
ఆ రెండు రోజులూ వేస్ట్ చేయడకుండా ఇండియా వెళ్లి, షూటింగ్ చేస్తున్నా’’ అన్నారు ప్రియాంక. అమెరికా రాకముందే మీకు ఇంగ్లిష్ వచ్చా? అని చెల్‌సీ అడిగితే - ‘‘బాగా వచ్చు. నా ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లిష్. మీకో విషయం చెప్పనా? మా ఇండియన్ జనాభా సంఖ్య దాదాపు 130 కోట్లు. సుమారు పది శాతం మంది ఇంగ్లిష్ మాట్లాడతారు. ఆంగ్ల మాతృభాష కాని మిగతా దేశాలతో పోల్చితే మా దేశంలోనే ఎక్కువగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నాం. మీరు ఇండియా వస్తే.. ఇంగ్లిష్ మాట్లాడేవాళ్లతో ఎన్‌కౌంటర్ చేయొచ్చు’’ అన్నారు. ఈ షోలో ప్రియాంక చెప్పిన సమాధానాలు చాలా బాగున్నాయి. మంచితో పాటు చెడు.. చెడుతో పాటు మంచి ఉంటుందంటారు. అలా.. ఒక షోతో మంచి.. మరో షోతో ప్రియాంక చెడు అనిపించుకున్నారు.