కార్తీక్ పెద్ద హీరో అవుతాడు
‘‘పంపిణీదారునిగా ‘వైజాగ్’ రాజుకి మంచి పేరుంది. కార్తీక్ రాజు హీరోగా, సంగీతంలో రారాజైన మణిశర్మ స్వరసారథ్యంలో వైజాగ్ రాజు తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన డీవీ సీతారామరాజు (వైజాగ్ రాజు) తన కుమారుడు సత్య కార్తీక్ రాజుని హీరోగా పరిచయం చేస్తూ, నిర్మించిన చిత్రం ‘టిప్పు’. జగదీష్ దానేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు సీడీని ఆవిష్కరించి రాఘవేంద్రరావుకి ఇచ్చారు.
పచార చిత్రాలూ, పాటలు బాగున్నాయనీ కార్తీక్ మంచి హీరోగా నిలదొక్కుకోవాలని అయ్యన్న పాత్రుడు అన్నారు. కార్తీక్ నటించిన కొన్ని సీన్స్‌ని ఓ ప్రముఖ దర్శకుడు చూసి, మంచి భవిష్యత్తు ఉందని అభినందించారని వైజాగ్ సత్యానంద్ చెప్పారు. కేయస్ రామారావు మాట్లాడుతూ -‘‘వైజాగ్ రాజుతో నాది 40 ఏళ్ల స్నేహం. ఆయనో సినిమా పంపిణీ చేస్తే, కచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ ఉండేది. ఈ చిత్రంతో ఆయన తనయుడు పెద్ద హీరోగా నిలబడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత చెప్పారు. ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ్, బి. గోపాల్, ఆర్. నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.