హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్ లెట్ మరో చాలెంజింగ్ రోల్ లో నటించనుంది. టైటానిక్, హెవెన్లీ క్రీచర్స్, లిటిల్ చిల్డ్రన్, స్టీవ్ జాబ్స్ వంటి చిత్రాల్లో నటించిన ఈ భామ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న వార్ డ్రామాలో నటించేందుకు అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ విలేఖరి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
యుద్ధ సమయంలో సాహసోపేతంగా వ్యవహరించి నాజీల కాన్నన్ ట్రేషన్ క్యాంపులు, అక్కడ వారు విధించే శిక్షలకు సంబంధించిన ఫోటోలను సాధించిన అమెరికా ఫొటోగ్రాఫర్ లీ మిల్లర్ బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిల్లర్ జీవితంపై రాసిన 'ద లైవ్స్ ఆఫ్ లీ మిల్లర్' నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.