ఆ కోర్కెలు వెంటాడుతూనే ఉన్నాయి
ఆశించినవన్నీ జరగవు. అయినా కలల్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించడంలో తప్పు లేదు. కృషి, పట్టుదల, లక్ష్యసాధనకు దోహదం చేస్తాయి. అలా తన కలల్ని సాకారం చేసుకుంటానంటున్నారు నటి తాప్సీ. ఈ బ్యూటీ తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ బ్యూటీకి ఇక్కడికంటే టాలీవుడ్‌లోనే మంచి మార్కెట్ ఉందన్నది నిజం.ఆ మధ్య ఆరంభంలో నటించి మంచి మార్కులే కొట్టేశారు. అయితే నటిగా ఇంత ప్రాచుర్యం పొందిన ఈ బ్యూటీకి నటి అవ్వాలనే కోరిక గాని, అవుతాననే ఆలోచన గానీ మొదట లేవట.
బుద్ధిగా చదువుకుని మార్కెటింగ్ రంగంలో రాణించాలని ఆశపడ్డారట. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ చదివిన ఈ అమ్మడికి డిగ్రీ మూడవ ఏట చదువుతున్న సమయంలోనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందట. ఆపై తన చదువును కొనసాగించలేకపోయారట. ఒక్కసారి తను చదువుకునే రోజుల్ని తాప్సీ గుర్తు చేసుకుంటూ అప్పట్లో ఎంబీఏ పూర్తి చేయాలని, మార్కెటింగ్ రంగంలో రాణించాలని అన్నది తన డ్రీమ్‌గా ఉండేవని తాప్సీ పేర్కొంది.
కంప్యూటర్ సైన్స్ చదివినా, ఇంజినీర్ అవ్వాలనుకోలేదన్నారు. నిజం చెప్పాలంటే అప్పట్లో తనకు వేరే ఆలోచనలు చాలా ఉండేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో నటిగా పరిచయమవ్వడం అన్నది ఊహించని విషయమేనన్నారు. అయినా ఇప్పటికీ ఎంబీఏ పూర్తి చేయాలనే కోరిక, మార్కెటింగ్ రంగంలో రాణించాలనే ఆశ తనను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. తన డ్రీమ్ అయిన ఆ రెండింటినీ నెరవేర్చుకుంటానని తాప్సీ అంటున్నారు.