లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? | Tollywood Actress Shares Lockdown Moments | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు?

Published Fri, Apr 24 2020 12:06 AM | Last Updated on Fri, Apr 24 2020 4:52 AM

Tollywood Actress Shares Lockdown Moments - Sakshi

భూమిక, మధుబాల​​​​​​​

నెలరోజులయింది అందరం లాక్‌డౌన్‌లో ఉండి. గృహ నిర్భందనను, ప్రభుత్వ నిబంధనలను క్రమంగా పాటిస్తూ కరోనా దరి చేరకుండా పోరాటం చేస్తున్నాం. ఈ 30 రోజుల్లో ఏం చేశాం? ఏం నేర్చుకున్నాం? ఈ లాక్‌డౌన్‌ పూర్తయ్యేలోగా ఎలాంటి విషయాలు నేర్చుకొని బయటకు రావాలనుకుంటున్నాం? ఒక్కసారి అందరం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవే ప్రశ్నలను కొందరు స్టార్స్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారు.

అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక
‘‘ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానమే. మన కులం, మతం, స్టేటస్‌ ఇవేమీ మనల్ని ఎక్కువ...  తక్కువ చేయవు. ఈ విషయం కంటికి కనిపించని ఒక్క సూక్ష్మ జీవి మళ్లీ మనందరికీ గుర్తు చేస్తోంది’’ అన్నారు భూమిక. లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయం గురించి ఈ విధంగా చెప్పారు. కరోనా వైరస్‌ మనకు తెలియకుండానే దాడి చేస్తుంటుంది. చివరకు మనకు సరైన అంత్యక్రియలు కూడా జరగనివ్వకుండా చేస్తోంది. గోల్డెన్‌ టెంపుల్లో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే నిర్మల్‌ సింగ్‌  కల్సా పద్మశ్రీ పొందారు. ఆయన ఇటీవలే కరోనాతో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఊరి స్మశానంలో జరపొద్దని, వైరస్‌ వ్యాప్తి చెందుతుందని గ్రామ ప్రజలు అడ్డుపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో టైమ్‌ గడుపుతున్నాను. ఇంటి పని, వంట పని, మా పిల్లాడిని చదివిస్తూ, వాడితో ఆడుకుంటున్నాను. మొక్కల్ని పెంచుతున్నాను. మా కుక్కల్ని చూసుకుంటున్నాను. కరోనా నిజంగా మ్యాజిక్‌ చేసింది. అందరూ తమ  ఇంటి సభ్యులతో ఎక్కువసేపు గడిపేలా చేస్తోంది. వ్యాయామం చేస్తున్నాను. పంజాబీ మాట్లాడటం వచ్చు కానీ రాయడం, చదవడం రాదు. ప్రస్తుతం పంజాబీ నేర్చుకుంటున్నా. అలాగే కరోనా మనందరిలో క్రమశిక్షణ, కంట్రోల్‌ను  చాలావరకూ నేర్పింది. సాధారణంగానే నేను చాలా పరిశుభ్రతను పాటించే వ్యక్తిని. అందుకని శుభ్రం గురించి కొత్తగా నేర్చుకున్న విషయాలే లేవు. 

మానవత్వం మీద గౌరవం పెరిగింది - మధుబాల
‘‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే మానవత్వం, కృతజ్ఞతాభావం వంటి వాటి పట్ల నాకు ఉన్న గౌరవం పెరిగింది. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా గడ్డు పరిస్థితుల నుంచి మనందరం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటి మధుబాల. ఇంకా పలు విషయాలను ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం అందరం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా నా భర్త, పిల్లలు చాలా బిజీగా ఉంటారు. నిజానికి ఒక రోజులో మేం అందరం ఇంట్లో కలుసుకునే సందర్భాలు కూడా తక్కువ. ప్రస్తుతం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. రోజంతా మా ముఖాలు మేమే చూసుకుంటున్నాం.

నా భర్త, నా పిల్లలు కొంచెం ఆన్‌లైన్‌ వర్క్‌ చేస్తున్నారు. నాకు అలా కుదరదు కాబట్టి వ్యాయామం, యోగ, డ్యాన్స్, రీడింగ్‌ వంటివి చేస్తున్నాను. రోజులో సమయం కుదిరినప్పుడు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నాను. వ్యాయామానికి, రీడింగ్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను మానసికంగా ధృడంగా ఉండాలని కోరుకుంటాను. నా బాడీ, మైండ్‌ ఆరోగ్యంగా ఉండేందుకు శ్రమిస్తాను. నేను బుక్స్‌ ఎక్కువగా చదువుతాను. ప్రస్తుతం ఫిక్షన్‌కి చెందినవి కాకుండా కొన్ని సీరియస్‌ బుక్స్‌ చదువుతున్నాను. దీని వల్ల నాకు తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాను. నాలెడ్జ్‌ పెంచుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని ఉపయోగించు కుంటున్నాను.

ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం - తేజ
‘‘మనుషులందరం ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం. ఆ వైఖరి మారాలి’’ అంటున్నారు దర్శకుడు తేజ. లాక్‌డౌన్‌ సమయాల్లో ఆయన ఏం చేస్తున్నారు? అనే విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ లాక్‌ డౌన్‌ వల్ల మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భూమి కేవలం మనకు (మనుషులకు) మాత్రమే కాదు. భూమి మీద నివశించే ప్రతీ ఒక్కరికీ అంతే హక్కు ఉంటుంది.  

ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుతున్నాను, రాసుకుంటున్నాను, గిన్నెలు శుభ్రం చేస్తున్నాను, మా కుక్కపిల్లలకు స్నానం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, గార్డెనింగ్‌ చేయడం, మా ఆవిడ నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు తనకు డ్రైవర్‌గా ఉండటం వంటి పనులు చేస్తున్నాను. 
లాక్‌డౌన్‌ పరిస్థితుల ఆధారంగా ఓ కథ రాస్తున్నాను. గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్‌ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థలో కోర్స్‌ నేర్చుకుంటున్నాను. ఇది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అవగాహన చేసుకుంటున్నాను. ఈ కోర్స్‌ పాస్‌ అవుతాననే అనుకుంటున్నాను. 


తేజ, అల్లరి నరేష్‌

వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు - అల్లరి నరేష్
‘‘లాక్‌డౌన్‌లో భాగంగా గడిచిన ఈ 30 రోజులు ఓ వినూత్నమైన అనుభవాన్నిస్తున్నాయి. కరోనా కారణంగా మనకంటే తీవ్రంగా నష్టపోయిన కొన్ని దేశాల్లోని ప్రçస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు ‘అల్లరి’ నరేష్‌. ఇంకా పలు విషయాలను పంచుకున్నారు. మనం ఆగర్యోం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం, ఐసొలేషన్‌ వంటివాటితోనే మనం కరోనాను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి సమయాల్లో మన మానసిక ఆరోగ్యం, సహనం కూడా ముఖ్యమే.

మన ఇంట్లో చిన్నారులు ఉన్నప్పుడు రోజును తప్పనిసరిగా ఓ క్రమపద్ధతిలో ప్లాన్‌ చేసుకోవాల్సిందే. మా దినచర్య మా మూడున్నరేళ్ల పాప సమయపాలనను బట్టి ప్రారంభం అవుతుంది. నా భార్య (విరూప) నా కూతుర్ని ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకే నా భార్య ఈ లాక్‌డౌన్‌ పరిస్థితులను బాగా బ్యాలెన్స్‌ చేస్తోంది. మా చిన్నారికి పాఠాలు చెప్పడం, ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి చేస్తున్నాం. అయితే లాక్‌డౌన్‌ వల్ల మన రోటీన్‌ లైఫ్‌ తప్పక ప్రభావితం అవుతుంది. నేను వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రెండు వారాలుగా అదే పనిలో ఉన్నాను (సరదాగా).

వంట చేయడం అంటే రెసిపీని  ఫాలో కావడమే కాదు. తప్పనిసరిగా  కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను వంట చేయడాన్ని నా భార్య, నా కుమార్తె బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. దాంతో ముగ్గురం కలిసి వంట పనులు చేయాలనుకున్నాం. మా పాప వెల్లుల్లి తొక్క తీయడం, ఆకుకూరలను తుంచడం వంటి పనులు చేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది. నాకు హలీమ్‌ అంటే ఇష్టం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల బయటకు వెళ్లి తినలేం. అందుకని ఈ ఏడాది నేనే స్వయంగా హలీమ్‌ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement