
రాఖీ వేడుకల్లో తారలు..
సినీ ప్రముఖులంతా రక్షా బంధన్ వేడుకల్లో ఉన్నారు. రాఖీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్.. తన సోదరి నీహారికతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. బాన్సువాడలో శేఖర్ కమ్ముల 'ఫిదా' షూటింగ్లో బిజీగా ఉన్న అన్న దగ్గరకు వెళ్లి రాఖీ కట్టింది ఈ మెగా చెల్లెలు.
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ రకుల్ ప్రీత్ సింగ్.. 'ధృవ' షూటింగ్ సెట్స్లో ఉంది. రకుల్ తమ్ముడు అమన్.. షూటింగ్ స్పాట్కు వెళ్లి అక్కకు తన చెయ్యందించాడు. ఆనందంగా రాఖీ కట్టిన రకుల్.. 'ఎంత ఫైట్ చేసుకున్నా..నువ్వే నా బలం తమ్ముడూ' అంటూ ప్రేమనంతా ట్వీట్ రూపంలో బయటపెట్టింది.
గులాబీ బాల హన్సిక తన సోదరుడికి రాఖీ కడుతూ, అతడిని ఆశీర్వదిస్తూ.. బోలెడంత సంతోషాన్ని వ్యక్తపరిచింది. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తన సోదరుడితో జరుపుకున్న రాఖీ వేడుకలను ట్విట్టర్లో పంచుకుంది. 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ తన సోదరితో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. అన్నదమ్ముల్లాంటి మంచి అక్కచెల్లెళ్లం మేం.. అంటూ అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది. బ్రదర్స్ లేని అమ్మాయిలందరూ.. తమ సిస్టర్స్ను సర్ప్రైజ్ చేయమంటూ ట్వీట్ చేసింది.
అలాగే బాలీవుడ్ ప్రముఖులు కూడా రాఖీ పౌర్ణమిని సంబరంగా జరుపుకుంటున్నారు. అభిషేక్ బచ్చన్, పరిణీతి చోప్రా, సూరజ్ పంచోలీ తదితరులు శుభాకాంక్షలతోపాటు తోబుట్టువులతో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. జూహీ చావ్లా దూరమైపోయిన తన సోదరుడిని తలచుకుంటూ తన చిన్ననాటి ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.