సతీసమేతంగా కొరటాల శివ @ మోతె
- సతీమణితో కలిసి చారిత్రక మోతె వీరభద్రస్వామి, భద్రాద్రిలో 'శ్రీమంతుడు' దర్శకుడి ప్రత్యేక పూజలు
ఖమ్మం: శ్రీమంతుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందని, రానున్న రోజుల్లో ఇలాంటి మెసేజ్‌తో కూడిన సినిమాలు మరిన్ని వచ్చే అవకాశాలున్నాయన్నారు దర్శకుడు కొరటాల శివ. శనివారం సతీసమేతంగా ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, మోతె ఆలయాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబు అమ్మమ్మ ఊరికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంతోపాటు మహేశ్ బాబుకు ఓ విన్నపం కూడా చేశారు..
'ప్రేక్షకులకు చక్కని ఆలోచన కలిగిస్తే తప్పకుండా అటువంటి సినిమాను ఆదరిస్తారు. ప్రతీ సినిమా శ్రీమంతుడులాగే ఉండాలని లేదు. దర్శకుడిగా శ్రీమంతుడు సినిమా మంచి సంతృప్తినిచ్చింది. కొత్త ప్రాజెక్టుకు చర్చలు ప్రారంభమయ్యాయి. ఇకపోతే.. హీరో మహేష్‌బాబు అమ్మమ్మ స్వగ్రామం బూర్గంపాడు మండలం ముసలిమడుగు అని తెలుసుకున్నాక ఆశ్చర్యానికి లోనయ్యా. ఈ గ్రమాన్ని ఓ సారి సందర్శించాలని మహేష్‌బాబుకు చెబుతా' అని కొరటాల శివ అన్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలంతోపాటు బూర్గంపాడు మండలం సారపాక నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది మధ్యలో (మోతెగడ్డ) కొలువైన వీరభద్రస్వామిని కొరటాల దంపతులు దర్శించుకున్నారు. అద్భుత నిర్మాన శైలిలో శతాబ్ధాల కిందటే నిర్మితమైన మోతెగడ్డ ఆలయం సరైన గుర్తింపునకు నోచుకోలేకపోయింది. కాగా, మొన్నటి గోదావరి పుష్కరాల సందర్భంలో మాత్రం అనూహ్య ఆదరణ పొందింది. రహదారి సౌకర్యాన్ని మెరుగుపర్చడంతో వీరభద్రస్వామి ఆలయంతోపాటు దానికి సమీపంలోని చంద్రశేఖరస్వామి ఆలయానికి కూడా భక్తులు, సెలబ్రిటీల రాక పెరుగుతున్నది. కొరటాల రాకతో మోతె ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.