
తెలుగు తెర సాంకేతిక విప్లవకారుడు
వంద అడుగుల ఎత్తు నుంచి దూకడం, డూప్ లేకుండా పోరాటాలు చేయడం.. ఇది కాదు సాహసం అంటే. సాహసం అంటే... ఏటికి ఎదురీదడం.
వంద అడుగుల ఎత్తు నుంచి దూకడం, డూప్ లేకుండా పోరాటాలు చేయడం.. ఇది కాదు సాహసం అంటే. సాహసం అంటే... ఏటికి ఎదురీదడం. మదగజాలను ఢీ కొట్టడం. అనుకున్నది సాధించేవరకూ అవిశ్రాంతంగా పోరాటం సాగించడం. కెరీర్ ఆసాంతం కృష్ణ చేసింది అదే. ‘అసలు ఇతను హీరో ఏంటి? మంచి రంగూ, ఒడ్డూ పొడుగు ఉన్నంత మాత్రన హీరోలైపోతారా’ అని హేళనగా మాట్లాడిన వారి నోటితోనే... ‘హీరోయిజానికి ఇతనే చిరునామా’ అనేట్లు చేసిన నిత్య కృషీవలుడు కృష్ణ. ‘దేవదాసు, కురుక్షేత్రం, అల్లూరి సీతారామరాజు’ చిత్రాలతో మహానటులకే సవాలు విసిరిన ధీశాలి కృష్ణ.
ఆవేశం, ఆత్మ విశ్వాసం కృష్ణకు ఆభరణాలు. అవే ఆయనను ‘సూపర్‌స్టార్’ను చేశాయి. అందుకు ఉదాహరణగా కృష్ణకు సంబంధించిన ఓ సంఘటనను గుర్తు చేసుకోవాలి. ‘తేనెమనసులు’ విడుదలయ్యాక ప్రశంసలన్నీ అందులోని మరో హీరో రామ్మోహన్‌నూ, విమర్శలన్నీ కృష్ణనూ వరించాయి. ఆ పరిణామానికి ఆయన కుంగిపోలేదు. మద్రాస్‌లో తన మిత్రులందరి ముందు ‘నంబర్‌వన్ అనిపించుకు తీరుతా’ అని ఛాలెంజ్ చేశారు. కృష్ణ ఆ సవాల్ విసిరినప్పుడు అక్కడున్న ఆయన మిత్రులెవరో తెలుసా? శోభన్‌బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, రామ్మోహన్. వారందరి ముందు ఛాలెంజ్ చేయడమే కాదు. అనుకున్నది సాధించారు కూడా. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత తెలుగు తెరపై ‘నంబర్‌వన్’గా భాసిల్లారు.
ఒక స్టార్‌గానే కాదు, నటునిగా కూడా కృష్ణ చేసిన ప్రయోగాలు అసాధారణమైనవి. హీరోగా తన మూడో సినిమా ‘గూఢచారి 116’ చిత్రంలో ప్రత్యర్థుల్ని మట్టి కరిపించే మగధీరునిగా కనిపించిన కృష్ణ... ఆ వెంటనే వచ్చిన బాపుగారి ‘సాక్షి’ సినిమాలో పిరికితనం, అమాయకత్వంతో కూడిన పాత్రను పోషించి భళా అనిపించారు. ‘అల్లూరి సీతారామరాజు’లో అయితే... మహానటులకు దీటైన నటన కనబరిచి తెలుగుతెరపై అద్భుతాన్ని ఆవిష్కరించారు. ‘కృష్ణావతారం, ఈనాడు, ముందడుగు, రక్తసంబంధం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, సింహాసనం..’ ఇత్యాది చిత్రాలు కృష్ణ అసాధారణ నటనకు తార్కాణాలు.
తెలుగు సినిమాను ఉన్నత స్థితికి తీసుకొచ్చిన మహనీయుల్లో కృష్ణ ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. తెలుగుతెరపై సాంకేతిక విప్లవకారుడాయన. కృష్ణ అప్పట్లో నాలుగు షిఫ్ట్‌లు పనిచేసేవారు. ఒకే స్టూడియోలో ఎక్కువ ఫోర్లలో ఆయన షూటింగులే జరుగుతుండేవి. కాసేపు నిద్రపోవాలనుకుంటే... ‘సార్... మా కాస్ట్యూమ్స్ వేసుకొని పడుకోండి... మా సినిమాలో మీరు నిద్రపోతున్న షాట్స్ కొన్ని ఉన్నాయి. అవి తీసుకుంటాం’ అని దర్శకులు అడిగే స్థాయిలో సాగేది అప్పట్లో కృష్ణ ప్రభ. విరివిగా సినిమాలు చేసి... వేలాది కళాకారులకు ఆసరాగా నిలిచారాయన. ఇప్పటికి కృష్ణ 344 చిత్రాల్లో నటించారు.
మంచి పాత్ర వస్తే ఇంకా నటించడానికి ఆయన సిద్ధం. ఎందుకంటే... కృష్ణకు నాగరా శబ్దాలంటే ఇష్టం. ఆర్క్ లైట్ల కాంతులంటే ఇష్టం. ‘షాట్ రెడీ... యాక్షన్... కట్’ అనే కేకలంటే ఇష్టం. నిరంతరం కోలాహలం మధ్య బతకడం ఇష్టం. అభిమానులతో మమేకమైపోవడం ఇష్టం. మొత్తంగా ఆయనకు సినిమా అంటే ఇష్టం. సినిమాను ప్రేమిస్తారు.. శ్వాసిస్తారు కాబట్టే... అభిమానులు ఆయనను అంతగా ఆరాధిస్తారు. నేటితో కృష్ణ 72వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయన వెంటే ఉన్నారు.. ఉంటారు కూడా. ఎందుకంటే... కృష్ణారాధన వారికొక వ్యసనం.