కోలీవుడ్ అయితే ఓకే!
కోలీవుడ్ అయితే ఓకే!
Published Thu, Apr 24 2014 12:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సినీ వినీలాకాశంలో తమిళ సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉందనడం అతిశయోక్తి ఏ మాత్రం కాదు. బలమైన కథా బలం ఉన్నా చిత్రాలతో పాటు, అచ్చెరువు చెందే సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిత్రాలు తెరకెక్కించడంలోను కోలీవుడ్ తనకు తానే సాటిగా నిలిచింది. ప్రపంచ సినిమా తన వైపు చూసే స్థాయికి కోలీవుడ్ ఎదుగుతోంది. ఒకప్పుడు తమిళనాడు వరకే పరిమితమైన తమిళ సినిమాలు నేడు ప్రపంచ స్థాయికి విస్తరించాయన్నది ఎవరూ కాదనలేని నిజం. ఇంతకు ముందు బాలీవుడ్‌నే బడాగా భావించే విదేశీ సినీ మార్కెట్ వర్గాలు ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల వ్యాపారంపై మక్కువ పెంచుకుంటున్నాయి. తమిళ సినిమా సత్తాను హిందీ చిత్ర పరిశ్రమ గుర్తిం చింది.
అందుకు పలువురు హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తమిళ చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి అధిక ఆసక్తి చూపేవారు. అలా దక్షిణాదికి చెందిన వైజయంతి మాలా బాలి, హేమమాలిని, జయప్రద, శ్రీదేవి వంటి నటీమణులు బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా ఏలారు కూడా. అలాంటిది తాజాగా ఉత్తరాది బ్యూటీలు దక్షిణాది చిత్రాలు, ముఖ్యంగా తమిళ చిత్రాల్లో నటించడానికి ఉవ్విళ్లూరుతుండడం విశేషం. ఇప్పటికే ఉత్తరాదికి చెందిన హన్సిక, కాజల్, తాప్సీ, యామి గౌతమ్ తదితరులు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు. అంతేకాదు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లుగా ప్రకాశిస్తున్న దీపిక పదుకొనే, ఐశ్వర్యారాయ్, సోనాక్షి సిన్హా వంటి హీరోయిన్లు కోలీవుడ్ ఆఫర్ అయితే ఓకే అంటూ రెండో ఆలోచన లేకుండా అంగీకరించడానికి సిద్ధం అవుతున్నారు.
ఆరంభం ఇక్కడే
ప్రపంచ సుందరి కిరీటం పొందిన ఐశ్వర్యారాయ్ సినీ జీవితం ఆరంభమయిందే కోలీవుడ్‌లో. మణిరత్నం ఇరువర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమై ఆ తరువాత జీన్స్, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాలతో తమిళ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఆ తరువాతనే బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్ర అవకాశం అంటే సాధ్యమయినంతవరకు ఐశ్వర్యారాయ్ వదులుకోవడానికి ఇష్టపడరు. సుమారు పదేళ్ల తరువాత మణిరత్నం చిత్రం రావణన్, శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్‌కు జంటగా ఎందిరన్ చిత్రాల్లో మెరిశారు. తాజాగా కొన్ని ఆటంకాలు ఎదురయినా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
మరో భామ రెడీ
మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తమిళ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. నిజానికి ఈ ముద్దుగుమ్మ ఇంతకు ముందే కమల్ హాసన్ సరసన విశ్వరూపం చిత్రంలో నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఆ తరువాత అంజాన్ చిత్రంలో సూర్యతో సింగిల్ సాంగ్‌కు చిందేయనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించడానికి సిద్ధం అవుతున్నారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీరితోపాటు నటి కంగనా రనౌత్ ధామ్ ధూమ్ చిత్రం ద్వారా, ప్రియాంక చోప్రా తమిళన్ చిత్రంతోను, లారాదత్త అరసాట్చి, డేవిడ్ చిత్రాలతోను, మనీషా కొయిరాలా బాంబే, ఆలవందాన్, ముదల్వన్, బాబా, ముంబాయి ఎక్స్‌ప్రెస్ తదితర చిత్రాలతోను, టబు కాదల్ దేశం, కండుకొండేన్ కండుకొండేన్ చిత్రాల్లో, సుస్మితా సేన్ రక్షకన్ చిత్రం ద్వారా, కాజోల్ మిమ్సార కనవు చిత్రం లోను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. మరి కొందరు కోలీవుడ్ చిత్రాలపై కన్నేశారు. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.
ఎంట్రీ
ఇప్పటికే దీపికపదుకొనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కోచ్చడయాన్ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించా రు. ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బాలీవుడ్ బ్యూటీ రజనీకాంత్ సరసన నటించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రాలు అవతార్, టిన్‌టిన్ చిత్రాల తరహాలో మోషన్ క్యాప్చరింగ్ ఫార్మెట్‌లో రూపొందిన తొలి భారతీయ 3డీ చిత్రం కోచ్చడయాన్. ఈ చిత్రం మే నెల 9న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది.
Advertisement
Advertisement