
అతనితో కలిసి తాజ్‌మహల్‌కు!
‘‘నేను ఇష్టపడేవాళ్లతో కలిసి ఢిల్లీ వెళ్లా...’’ అంటూ ఇటీవల త్రిష ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక.. అప్పట్నుంచీ త్రిష ఇష్టపడేవాళ్లెవరు? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె ఇష్టపడేవాళ్ల జాబితాలో అతను ఉండే ఉంటాడనే చర్చ కూడా జరిగింది. అతగాడెవరో కాదు.. ‘వరుణ్ మణియన్’. ఇటీవల వరుణ్‌తో త్రిష నిశ్చితార్థం జరిగిందనీ, వచ్చే ఏడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనీ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలో నిజం లేదని త్రిష పేర్కొన్నారు. దాంతో అది సద్దుమణిగింది. కానీ, ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది.
ఎందుకంటే... త్రిషతో ఢిల్లీ వెళ్లినవాళ్లల్లో వరుణ్ కూడా ఉన్నారు. మొత్తం నలుగురైదుగురు స్నేహితులతో కలిసి త్రిష ఢిల్లీలోని తాజ్‌మహల్‌ని సందర్శించారు. ఆ నలుగురైదుగురులో వరుణ్ మినహా అందరూ అమ్మాయిలే. వాళ్లతో కలిసి త్రిష తాజ్ ముందు డాన్స్ చేశారు. వాటితో పాటు.. తాజ్ ప్రయాణంలో భాగంగా దిగిన ఫొటోలను కూడా బయటపెట్టారు. వాటిలో వరుణ్ మణియన్‌ని చూసినవాళ్లు.. త్రిషతో ఇతగాడు ఎందుకెళ్లాడబ్బా? అని మాట్లాడుకుంటున్నారు.