రాఘవేంద్రరావుతో పలువురు దర్శకులు
దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని (మే 4) దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ)ను ఏర్పాటు చేయాలని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు తీర్మానించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి వైద్యం, విద్య, కుటుంబ అవసరాలకు సహాయం చేసే విధంగా ఒక నిధిని ఏర్పాటు చేసి, ఈ డబ్బుపై వచ్చే వడ్డీతో అర్హులైన వారికి తోడ్పాటుని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ముందుగా దర్శకులు రాజమౌళి 50 లక్షలు, దర్శకుడు రాఘవేంద్రరావు 10 లక్షలు, ఆర్కా మీడియా వారు 15 లక్షల విరాళం అందించారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ ఆలోచనను మెచ్చి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
ప్రస్తుతం దర్శకుల సంఘం ప్యానెల్ మిగతా దర్శకుల సహాయ, సహకారాలతో ఈ టీఎఫ్‌డీటీ ట్రస్టును బుధవారం (24–07–2019) రిజిస్టర్ చేశారు. ‘‘టీఎఫ్‌డీటీకి మరింత మెరుగైన భవనం, లైబ్రరీ, ఫంక్షన్ హాల్, దర్శకత్వ శాఖలో ప్రావీణ్యత తరగతులు, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా కేటీఆర్‌గారికి జన్మదిన (జూలై 24) శుభాకాంక్షలు’’ అని టీఎఫ్‌డీటీ మేనేజింగ్ ట్రస్టీ ఎన్. శంకర్ పేర్కొన్నారు. రాఘవేంద్రరావు అధ్యక్షుడిగా ఉన్న ఈ సంఘంలో దర్శకులు వీవీ వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, వంశీపైడిపల్లి, మెహెర్ రమేష్, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్. రవి ట్రస్టీ సభ్యులుగా, మెహెర్ రమేష్ ట్రెజరర్‌గా వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment