
సీరియల్సే..సో బెటరూ: శ్రీలక్ష్మి
అబ్బ.. దబ్బ.. జబ్బ.. అంటూ మౌనంగానే నవ్వుల పూలు పూయించగలరు... తాగుబోతు దేవదాసుగా కిందపడిపోతూ, పైకిలేస్తూ ఫక్కున నవ్వించగలరు.. వెరైటీ కవితలు, కొత్తరకం వంటకాలతో హాస్యపు జల్లులు కురిపించగలరు.. ఆమే నవ్వుల లక్ష్మి శ్రీలక్ష్మి. కమెడియన్లుగా మగవారే హల్‌చల్ చేస్తున్న రోజుల్లో హాస్యనటిగా ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కరుణరసం, గయ్యాలి పాత్రల్లోనూ చక్కగా ఇమిడిపోయే రూపం ఆమెది. ఎంతోకాలంపాటు మరో హాస్యనటికి అవకాశం ఇవ్వకుండా వెండితెరను ఏలిన శ్రీలక్ష్మి ఓ టీవీ సీరియల్ షూటింగ్‌లో పాల్గొనేందుకు కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
ప్రశ్న : సినీ పరిశ్రమలో మీ ఎంట్రీ ఎలా జరిగింది?
శ్రీలక్ష్మి : మా తండ్రి అమరనాథ్ నటుడు, నిర్మాత. సోదరుడు రాజేష్ కూడా నటుడిగా రాణించారు. నాన్న మరణించాక 1980లో స్వర్గం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాను.
ప్ర : ఎన్ని సినిమాల్లో నటించారు?
శ్రీలక్ష్మి : దాదాపు 500 సినిమాల్లో నటించాను. తమిళ, కన్నడ, మళయాలంలో హీరోయిన్ పాత్రలు కూడా చేశాను. సుమారు 40 మంది కామెడీ యాక్టర్లతో పనిచేశాను.
ప్ర : హీరోయిన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా ఎలా స్థిరపడ్డారు.
శ్రీలక్ష్మి : కళను ప్రదర్శించాలే కానీ.. అది హీరోయిన్ అయితే ఏంటీ, కామెడీ అరుుతే ఏంటీ. నేనెప్పుడూ ఆవిధంగా ఆలోచించలేదు. దర్శకులు జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ నాకు చక్కటి పాత్రలు ఇచ్చారు.
ప్ర : టీవీ సీరియళ్లలోకి రావడానికి కారణమేమిటీ?
శ్రీలక్ష్మి : బుల్లితెరకు, పెద్దతెరకు తేడా ఏం ఉండదు. సినిమాల కంటే టీవీ సీరియళ్లకే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. ‘మేఘమాల’లో బామ్మ పాత్ర పోషించాను. ఇప్పుడు ‘సఖీ’ సీరియల్‌లో హీరోయిన్ అమ్మగా చేస్తున్నాను. సరస్వతి అనే పెలైట్ ప్రాజెక్టు ఆఫర్ కూడా వచ్చింది.
ప్ర : కొల్లేరుపై మీ అభిప్రాయం..
శ్రీలక్ష్మి : హీరో కృష్ణ, ప్రభ హీరోహీరోయిన్లుగా తిలక్ దర్శకత్వంలో ‘కొల్లేటి కాపురం’ సినిమా తీశారు. అలా.. కొల్లేరు పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. పక్షులు, వాతావరణం ఎంతో బాగుంటుందని చెప్పారు. ఆ అందాలను తప్పకుండా వీక్షిస్తాను.
ప్ర : టీవీ సీరియళ్ల ప్రభావం సినిమాలపై ఉందా..
శ్రీలక్ష్మి : దేని దారి దానిది. ఇటీవల సీరియల్స్ చూసేవారు ఎక్కువయ్యారు. దానికి కారణం సీరియళ్లలో వివిధ కుటుంబ పాత్రలు. మంచిని చూపిస్తే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు.
ప్ర : సీనియర్ నటిగా కొత్త వారికి మీరిచ్చే సలహా..
శ్రీలక్ష్మి : సినీ పరిశ్రమలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. సలహాలు చెబుదామంటే వినేవారే లేరు. అడిగేవారూ లేరు. అందరూ మాకు అన్ని తెలుసు అనే ధోరణితోనే వస్తున్నారు. మా కాలంలో అలా లేదు. చివరిగా నేను చెప్పేదేంటంటే మనం ఎంచుకున్న లక్ష్యం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చు.