మిర్చి బ్యానర్లో చెర్రీ
బ్రూస్ లీ పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెడుతున్నాడు. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 150వ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఫారిన్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న చెర్రీ, తిరిగి రాగానే తను తరువాత చేయబోయే సినిమాల మీద క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీ ఒరువన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. అల్లు అరవింద్, డివివి దానయ్యలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వీలైనంత త్వరగా మరో సినిమాను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు మగధీరుడు.
మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు వరుస సూపర్ హిట్స్ అందించిన ఈ బ్యానర్లో సినిమా చేయటం, తన కెరీర్కు కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నాడట చరణ్. ఈ సినిమాకు అదే బ్యానర్లో జిల్ సినిమాను డైరెక్ట్ చేసిన రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.