ఎవరి టైమ్‌ వాళ్లకు వస్తుంది | victory venkatesh interview about f2 movie | Sakshi
Sakshi News home page

ఎవరి టైమ్‌ వాళ్లకు వస్తుంది

Published Thu, Jan 10 2019 2:06 AM | Last Updated on Thu, Jan 10 2019 4:28 AM

victory venkatesh interview about f2 movie - Sakshi

వెంకటేశ్

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 32 ఏళ్లవుతోంది. ఇప్పుడు కూడా సోలో హీరో అయితేనే చేస్తా అనడం కరెక్ట్‌ కాదు. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత హీరోనా, మల్టీస్టారర్‌ మూవీనా అనే ఆలోచన కలగడంలేదు. ఫలానా పాత్రే కావాలనే కోరికలు నాకు లేవు. పాత్రల గురించి మనం ఎవర్నీ అడగకూడదు. సోలో హీరోగా చేయమని డైరెక్టర్లు కథలు తీసుకొస్తే చేస్తా’’ అన్నారు వెంకటేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేశ్‌ చెప్పిన విశేషాలు.

► మంచి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్‌ 2’. ఫ్రస్ట్రేషన్‌లోనూ కామెడీ ఉంటుంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లో నేను చెప్పిన డైలాగులకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ‘దృÔ¶ ్యం, గురు’ వంటి సీరియస్‌ సినిమాలు చేశాక కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ చేయాలనుకుంటున్నప్పుడు అనిల్‌ ‘ఎఫ్‌ 2’ కథ చెప్పాడు. సంక్రాంతికి రియల్‌ ఫెస్టివల్‌ ఫిల్మ్‌ ‘ఎఫ్‌ 2’.


► అనిల్‌ వెరీ పాజిటివ్‌.. సిన్సియర్‌. తను రచయిత కూడా కావడంతో మంచి డైలాగులు రాశాడు. వరుణ్‌ తేజ్‌ వెరీ నైస్, సింపుల్‌ పర్సన్‌. ఏ ఇమేజ్‌లో ఇరుక్కోకుండా కొత్తగా చేయాలనుకుంటాడు. ఎవర్నీ అనుకరించకుండా తన స్టైల్‌లో చేశాడు.  


► కుటుంబ కథా చిత్రాల్లో నేను బాగా ఒదిగిపోవడంతో పాటు మంచి ఎమోషన్స్‌ని పండిస్తానని ప్రేక్షకులు అంటుంటారు. దానికి కారణం.. నా స్కూల్, కాలేజ్‌ డేస్‌లో ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లకు వెళ్లేవాణ్ని. అక్కడ వారి ఎమోషన్స్, బిహేవియర్‌లను పరిశీలించేవాణ్ణి. మాది పెద్ద కుటుంబం.. మంచి సర్కిల్‌ ఉంది. పైగా స్కూల్‌డేస్‌ నుంచే ఆధ్యాత్మికం గురించి తెలుసుకోవడం వల్లేనేమో అనుకుంటున్నా.


► ‘గురు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నా కుదరలేదు. వైవిధ్యమైన సినిమా చేయాలనుకోవడం వల్లే గ్యాప్‌ వచ్చింది. పైగా యంగ్‌స్టర్స్‌ చేస్తున్న కథలతో నేను సినిమాలు చేయలేను (నవ్వుతూ). నేను, రానా ఓ సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు తను ‘బాహుబలి’తో బిజీ అయిపోయాడు.


► యాక్టింగ్‌ అనేది సహజంగా అందరిలోనూ ఉంటుంది. కొందరు చేసే కొద్దీ నేర్చుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఓపికగా ఉంటే ఎవరి టైమ్‌ వారికి కచ్చితంగా వస్తుంది. మంచి కథలు ఎంచుకుంటూ సిన్సియర్‌గా కష్టపడుతుండాలి. హిట్‌ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. అయితే మన ఆలోచనా విధానం పాజిటివ్‌గా ఉండాలి. అదే నిజమైన సక్సెస్‌.


► రియల్‌ లైఫ్‌లో నేను ఫ్రస్ట్రేషన్‌కి దూరంగా ఉంటా. ప్రతిరోజూ ప్రకృతితో సావాసం చేస్తా. అప్పుడే దాని ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. నేను రోజూ సూర్యోదయం చూస్తా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌... అందరూ అశాశ్వతం. ప్రకృతే శాశ్వతం. దాన్ని మనం అర్థం చేసుకుంటే సమస్యలు రావు.


► చాలెంజింగ్‌ రోల్స్‌ అంటే బాగా ఇష్టం. అందుకు టైమ్‌ రావాలి. అమితాబ్‌గారు ఎన్ని పాత్రలు చేసినా ‘బ్లాక్‌’ సినిమాలోని పాత్ర సూపర్బ్‌. నేను ‘రోజా’ సినిమా చేయలేకపోయా. కానీ ఆ తర్వాత ‘సుందరకాండ’ వంటి మంచి మూవీ చేశా. ‘రోజా’ సినిమా చేసుంటే హిందీలోనూ ఎక్కడికో వెళ్లిపోయేవాణ్ణి. నాకు ‘బాహుబలి’లాంటి సినిమా చేయాలనుంది. అయితే ఆ పాత్ర మనకి రావాలి. నాకు రాలేదే అని ఎప్పుడూ బాధపడకూడదు.


► బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా కథ చాలా బాగుంటుంది. నా కోసం త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అనిల్‌ రావిపూడి కథలు తయారు చేస్తు న్నారు. ఇమేజ్‌ చట్రం అంటే ఏంటో నాకు తెలియదు. మన నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఓ ఇమేజ్‌ని ఆశిస్తారు. కానీ, ఓ ఇమేజ్‌ రావాలనే కోరిక నాకు లేదు. సినిమా బాగుండాలి. నిర్మాత, సినిమా కొనేవాళ్లు నష్టపోకూడదని ఆలోచిస్తా. కానీ, బయట నాపై చూపించే ఇమేజ్‌ని నేను కంట్రోల్‌ చేయలేను. క్రమశిక్షణ, కష్టపడే తత్వం నా కంట్రోల్‌లో ఉంటాయి. అవి నాన్నగారి (రామానాయుడు) నుంచే నేర్చుకున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement