వెంకటేశ్
గతేడాది ‘గురు’ సినిమా తర్వాత మళ్లీ థియేటర్‌లో ప్రేక్షకులను పలకరించలేదు వెంకటేశ్. ఈ ఏడాది ఆయన సినిమాలు థియేటర్స్‌లోకి రావన్న విషయంపై క్లారిటీ వచ్చింది. కానీ ఆయన అభిమానులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది వెంకీ సినిమాలు కనీసం రెండు విడుదల అవుతాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలసి ఆయన హీరోగా నటిస్తున్న ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా ఈ నెల 7న విడుదల కానుందని సమాచారం. అలాగే కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి వెంకీ ‘వెంకీమామ’ అనే సినిమాలో నటిస్తారు.
ఈ సినిమా డిసెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. సో.. ఈ రెండు సినిమాలు కచ్చితంగా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి వస్తాయి. ‘ఎఫ్ 2, వెంకీమామ’ సినిమాలే కాకుండా తాజాగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరోగా నటించడానికి వెంకటేశ్ పచ్చజెండా ఊపారని సమాచారం. త్రినాథరావు ఓ ఆసక్తికరమైన కథ చెప్పడం, వెంకీ విని సరే అనడం జరిగిపోయాయట. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో కానీ లేదా వచ్చే ఏడాది జనవరిలో కానీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. అంటే.. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. సో.. అభిమానులకు వెంకీ ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment