
లేడీబాస్ ఈజ్ బ్యాక్?
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి సుమారు తొమ్మిదేళ్ల తరువాత నటించి మంచి హిట్ కొట్టారు.
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరంజీవి సుమారు తొమ్మిదేళ్ల తరువాత ఖైదీ నంబర్ 150 చిత్రంలో నటించి మంచి హిట్ కొట్టారు. మెగాస్టార్ ఇమేజ్‌తోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి తాజాగా మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే చారిత్రక కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా లేడీ సూపర్‌స్టార్‌గా రాణించిన నటి విజయశాంతి అదే ఫామ్‌లో ఉండగానే రాజకీయరంగ ప్రవేశం చేశారు.
1980లో నటిగా పరిచయం అయిన విజయశాంతి ఆదిలో గ్లామర్ పాత్రల్లో నటించినా ఆ తరువాత లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ పొందారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి లేడీబాస్ ఈజ్ బ్యాక్ అననున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయశాంతి ప్రస్తుతం దర్శక నిర్మాత వద్ద కథలు వినే పనిలో బిజీగా ఉన్నారట.
అదే విధంగా నటిగా మరో రౌండ్ కొట్టడానికి సిద్ధం అవుతున్న విజయశాంతి అందుకు తగ్గట్టుగా ఫిజిక్‌ను తయారు చేసుకోవడానికి జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఆమె నటించనున్న చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్. విజయశాంతి మళ్లీ నటిస్తున్నారంటే అది కచ్చితంగా భారీ చిత్రమే అవుతుంది. అదే విధంగా ద్విభాషా చిత్రం అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. విజయశాంతి రీఎంట్రీ చిత్రం వివరాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.