
ఒక సంచలన కలయికకు రంగం సిద్ధం అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో తాజాగా హల్‌చల్ చేస్తోంది. నటుడు కమలహాసన్ రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే పార్టీ పేరు, గుర్తును వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఆయన నటిస్తున్న విశ్వరూపం-2, శభాష్‌నాయుడు చిత్రాలను తొందరలోనే విడుదల చేసే పనిలో మునిగిపోయారు. తాజాగా కమలహాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఒక క్రేజీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి రాజేశ్ సెల్వ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఈయన ఇంతకు ముందు కమలహాసన్, త్రిష జంటగా నటించిన తూంగావనం చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం.
కమల్ ఇంతకుముందు తాను నిర్మాతగా నాజర్ ప్రధాన పాత్రలో మగళీర్ మట్టుం, సత్యరాజ్ హీరోగా కడమై కన్నియం కట్టుపాటు, మాధవన్ కథానాయకుడిగా నలదమయంతి వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్న కమలహాసన్ చిత్ర పరిశ్రమకు దూరం కాకుండా మంచి చిత్రాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విక్రమ్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఆయన అతిథిగా మెరిసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.