
విశ్వదాభిరామ... వినుర వేమ
‘‘సినీ పరిశ్రమలో ‘నాది తెలంగాణ’ అని ధైర్యంగా చెప్పుకునేవారు తక్కువ మంది ఉన్నారు. ఇక ఆ భయం అవసరంలేదు. మన రాష్ట్రం, మన ప్రభుత్వం వచ్చింది. ధైర్యంగా తెలంగాణ కళాకారులు ముందుకెళ్లొచ్చు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది’’ అని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ అన్నారు. స్వర్గీయ శ్రీహరి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘వినుర వేమ’. ‘విశ్వదాభిరామ’ అనేది ఉపశీర్షిక.
మనోజ్‌నందం, శ్రీషా జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.ధాకర్ దర్శకుడు. ఎం.విజయలక్ష్మి, శ్రీనివాస్ శేషగాని నిర్మాతలు. పూర్ణచంద్ర భైరి స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎన్.శంకర్, ప్రచార చిత్రాలను వీఎన్ ఆదిత్య విడుదల చేశారు. ‘‘ఉన్నత చదువులు చదివి, తల్లిదండ్రులకు పేరు తేవాల్సిన విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడి ఏ విధంగా జీవితాలను పాడుచేసుకుంటున్నారనేది ఈ సినిమా కథాంశం’’ అని దర్శకుడు చెప్పారు.