మదగజరాజా వస్తోంది!
మదగజరాజా చిత్రానికి మోక్షం కలగనుందనేది కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. విశాల్, వరలక్ష్మి,అంజలి జంటగా నటించిన చిత్రం మదగజరాజా. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది.చిత్ర నిర్మాణం పూర్తయి చాలా కాలమైంది. ఒకసారి విడుదల తేదీ వెల్లడించి కూడా చిత్రం విడుదల కాలేదు. కారణం ఆర్థికపరమైన సమస్యలే. అంతే కాదు మరోసారి చిత్ర హీరో విశాల్‌నే మదగజరాజా విడుదలకు ప్రయత్నించి విఫలమవడం గమనార్హం.
అప్పట్లో కొందరు బయ్యర్లు చిత్ర విడుదలకు సహకరించక పోవడమే అందుకు కారణం అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఇప్పుడు మదగజరాజా చిత్రానికి మోక్షం కలిగిందని కోలీవుడ్ వర్గాల టాక్. విశాల్ నటించిన తాజా చిత్రం కథకళి మంచి సక్సెస్ సాధించడం, అదే విధంగా దర్శకుడు సుందర్.సీ తాజా చిత్రం అరణ్మణై-2 చిత్రం విజయం సాధించడం మదగజరాజా చిత్రానికి హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నట్లు సమాచారం.
బయ్యర్లు కూడా అదే ఆలోచనతో ఉండడంతో మదగజరాజా చిత్రాన్ని మార్చి 11న తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. పక్తు కమర్షియల్ అంశాలతో కూడిన ఈ చిత్రంపై అప్పటిలోనే మంచి అంచనాలు నెలకొన్నాయన్నది గమనార్హం. విశాల్ ప్రస్తుతం మరుదు అనే చిత్రంలో నటిస్తున్నారు. కథకళి చిత్రం తరువాత విడుదలయ్యే చిత్రం మరుదునేనని భావిస్తున్న ఆయన అభిమానులకు మధ్యలో మదగజరాజా రానుండడం ఆనందమే అవుతుంది.