అభి ప్రవర్తనతో షాక్ తిన్న ఐష్!
ఇటీవల అట్టహాసంగా జరిగిన 'సరబ్‌జిత్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా భార్య ఐశ్యర్యరాయ్ పట్ల అభిషేక్ బచ్చన్ ప్రవర్తించిన తీరు.. అక్కడున్న వారిని కనుబొమ్మలు ముడేసేలా చేసింది. వయస్సు పెరుగుతున్నా వన్నె తగ్గని అందాల రాశి ఐశ్యర్య తాజా సినిమా 'సరబ్‌జిత్' ప్రీమియర్ షో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఐష్ భర్త అభి, మామ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఐష్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చాలామందే వచ్చారు.
కానీ, ఎందుకో ఈ వేడుకలో అభి చాలా ముభావంగా కనిపించాడు. ఐష్‌ను కొంత తప్పుకొని తిరిగాడు. ఫొటోలు దిగడంలో ఆసక్తి చూపించలేదు. ఫొటోగ్రాఫర్ల అభ్యర్థనతో ఐశ్ చేయి పట్టుకొని పిలుచుకొని వస్తే తప్ప భార్యతో కలిసి అతను ఫొటోలు దిగేందుకు ఒప్పుకోలేదు. అది కూడా ఐష్ పక్కన కొంతసేపు మాత్రమే నిలబడి.. పోజు ఇచ్చి.. అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అభి ప్రవర్తనతో ఆమె బిత్తరపోయింది. ఫొటోగ్రాఫర్లను సర్దిచెప్పడానికి, మళ్లీ అతన్ని పిలువడానికి ప్రయత్నించింది. కానీ, అభి ధోరణిలో అభి ఉండటంతో వదిలేసింది. నిజానికి 'సరబ్‌జిత్'లో ఐష్ నటన సూపర్ అంటూ అభి కితాబు కూడా ఇచ్చాడు. కానీ ప్రీమియర్ షో సమయంలో ఈ దంపతుల మధ్య ఏం గొడవ జరిగిందో, ఎందుకు వీరు అలా ఎడమొహం పెడమొహం ఉన్నారోనని బాలీవుడ్ గాసిప్ రాయుళ్లు ఇప్పుడు చెవులు కొరుక్కుంటున్నారు.