
‘బాబు’కు కోపమొచ్చింది!
ఒకరు తీసుకున్న నిర్ణయం మరెవరికో ఇబ్బంది కలిగించడమంటే ఇదే! మనం ‘బాబు’ అని పిలుచుకొనే హీరోలకు ఎవరికి కోపమొచ్చినా, ఆ దెబ్బ దర్శక - నిర్మాతల మీదే పడుతుంది. తాజాగా, యువ హీరో రణ్‌బీర్ కపూర్‌కు కోపం రావడంతో, దర్శకుడు - రచయిత అనురాగ్ కాశ్యప్ పరిస్థితి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. వాళ్ళిద్దరూ మిత్రులే కదా, మరి విషయం ఏమిటయ్యా అంటే... దానికో పెద్ద కథే ఉంది. ఇటీవల జరిగిన కొన్ని పత్రికా విలేకరుల సమావేశాల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా, తాజా చిత్రం ‘బాంబే వెల్వెట్’ చిత్ర ప్రచారానికి రావడానికి హీరో రణ్‌బీర్ కపూర్ నిరాకరిస్తున్నారు.
ఈ మధ్య ఈ సినిమా ప్రచారం కోసం ఏ కార్యక్రమం పెట్టినా, పత్రికా విలేకరులు పనిలో పనిగా నటి కత్రినా కైఫ్‌తో ఉన్న అనుబంధం గురించి, ఇద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారనీ రణ్‌బీర్‌ను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. దాంతో చిర్రెచ్చుకొచ్చిన రణ్‌బీర్ ‘బాంబే వెల్వెట్’ ప్రచార కార్యక్రమాలను వీలైనంత తగ్గించుకుంటున్నాడు. కొద్దిపాటి మీడియా వాళ్ళతోనే మాట్లాడేందుకు మొగ్గుచూపుతున్నారు. దాంతో, దర్శకుడు అనురాగ్ కాశ్యప్‌కు చిక్కొచ్చిపడింది. క్రితంసారి కూడా రణ్‌బీర్ ఇలాగే ‘రాయ్’ చిత్రం ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు.
ఆ దెబ్బ ఆ సినిమా బాక్సాఫీస్ వసూళ్ళపై పడింది. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకూ అదే ఇబ్బంది వస్తుందేమోనని అనురాగ్ తెగ భయపడుతున్నారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఆసక్తికరమైన అంశాలే అయినా, వాళ్ళ ప్రతిభా ప్రదర్శన సంగతి వదిలేసి, కేవలం వ్యక్తిగత విషయాల పైనే దృష్టి పెడితే ఎలాగన్నది రణ్‌బీర్ సమర్థకుల వాదన. అయితే, కష్టపడి, బోలెడంత ఖర్చుపెట్టి తీసిన సినిమా ప్రచారానికి హీరో గారు రాకపోతే, వసూళ్ళు ఎలాగన్నది దర్శక, నిర్మాతల బాధ. మరి, మిత్రుడైన రణ్‌బీర్‌ను అనురాగ్ ఎలా ఒప్పిస్తారో వేచిచూడాలి.