సాక్షి, న్యూఢిల్లీ : నిజజీవితంలో జరిగిన సంఘటనలను ప్రేరణగా తీసుకొని నిర్మించిన బాలీవుడ్ చిత్రం ‘ఆర్టికల్ 15’ విడుదలకు ముందే కాకుండా తర్వాత కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఏమి ఉంది? ఆ సినిమాకు స్ఫూర్తినిచ్చిన నిజ జీవిత పాత్రలెవరు? దేశంలో కుల వ్యవస్థ ఎంత భయానక రూపం దాల్చిందో, దళితులపై అగ్రవర్ణాల దాడులు ఎంత పాశవికంగా కొనసాగుతున్నాయో ఎవరిని, ఏ వర్గాన్ని అంతగా నొప్పించకుండా సున్నితంగా తెరకెక్కించారు అనుభవ్ సిన్హా. నిజాయితీగల పోలీసు పాత్రలో ఓ బ్రాహ్మణుడిని చూపించడం ద్వారా సినిమాకు సమతౌల్యత తీసుకొచ్చి కుల వ్యవస్థ కుళ్లును తెరమీద కక్కించాలనుకున్నారు సిన్హా. ఈ విషయంలో ఆయన ఎంత మేరకు విజయం సాధించింది ప్రేక్షకులే తేల్చుకోవాలి.
2014లో ఉత్తరప్రదేశ్‌లోని బదాన్‌లో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లను రేప్ చేసి హత్యచేసి వారిని చెట్టుకు వేలాడదీసిన సంఘటనను ఇతివృత్తంగా తీసుకొని సినిమా కథను రూపొందించారు. ఇందులో ఈ సంఘటనపై దర్యాప్తు జరిపే ఐపీఎస్ అధికారి అయాన్ రంజన్ పాత్రలో ఆయూష్మాన్ ఖురానా నటించారు. దళిత నాయకుడు నిషాద్ పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూబ్ నటించారు. ‘భీమ్ ఆర్మీ’ దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ రావన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాత్రను రూపొందించారు. తనకు సైన్స్ రైటర్ కావాలని ఉందని ఇందులో దళిత నాయకుడు నిషాద్ చెప్పడం, అదే మాట చెప్పిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న దళిత పీహెచ్‌డీ స్కాలర్ ‘రోహిత్ వేముల’ను గుర్తు చేస్తోంది. 2014లో జరిగిన దళిత అక్కా చెల్లెళ్ల ‘రేప్ అండ్ మర్డర్’ కేసునే కాకుండా గుజరాత్‌లోని ఉనాలో ఏడుగురు దళితులు మూక దాడిలో మరణించిన సంఘటనను కూడా స్ఫూర్తిగా తీసుకొని అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలంకి ఈ కథను తయారు చేశారనడంలో సందేహం లేదు.
ఆనంద్ తెల్తుంబ్డే రాసిన ‘రిపబ్లిక్ ఆఫ్ క్యాస్ట్’, ఓం ప్రకాష్ వాల్మీకీ రాసిన ‘జూఠన్’ పుస్తకాలను కూడా వీరిద్దరు చదివారు. హెచ్‌బీవోలో ప్రసారమైన ‘ట్రూ డిటెక్టివ్’ ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. సినిమాకు మరింత సహజత్వం తీసుకురావడానికి భోజ్‌పురి పాట ‘కహా తో లగ్ జాయ్ దగ్ సే’ పాటను వీధి కళాకారులతోనే పాడించారు. ఇది వరకు ‘ముల్క్’ తీసి ప్రేక్షకులను మెప్పించిన సిన్హా ఈసారి అదే ప్రయత్నించారు. మరింత వాస్తవానికి దగ్గరగా ఉండేలా ఆయన ఈ సినిమాలో ప్రయత్నించడం కొందరికి నచ్చకపోవచ్చు. వాస్తవికంగా దళితులపై జరిగిన అగ్రవర్ణాల దాడిని ఇతి వృత్తంగా తీసుకోవడం కూడా వారికి నచ్చి ఉండక పోవచ్చు. అగ్రవర్ణాల్లో అందరు చెడ్డవాళ్లు కాదని, మంచి వాళ్లు కూడా ఉంటారని చెప్పడం ద్వారా సినిమాకు సమతౌల్యతను తీసుకరావడానికి దర్శకుడు నిజాయితీగానే ప్రయత్నించారు. అనుభవ సిన్హా కూడా అగ్రవర్ణుడే అన్న విషయాన్ని ఇక్కడ మరవద్దు. (చదవండి: నాడు ‘ఆక్రోష్–నేడు ‘ఆర్టికల్–15’)
Comments
Please login to add a commentAdd a comment