ప్రణీత ఆనందోత్సవమ్
కథానాయిక ప్రణీత ఇప్పుడు తెగ సంతోషంగా ఉంది. శనివారం నాడు పుట్టినరోజు జరుపుకొంటున్న ఈ కన్నడ కస్తూరి ఆనందానికి కారణం లేకపోలేదు. గతంలో పవన్ కల్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’లో మెరిసిన ఈ మిల్కీవైట్ బ్యూటీ తాజాగా మహేశ్‌బాబు నటిస్తున్న ‘బ్రహ్మోత్సవమ్’లో నటిస్తున్నారు. ఇటీవలే ఆ సినిమా కోసం కొద్దిరోజులు షూటింగ్‌లో పాల్గొన్నారామె.
సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో ప్రణీత ఒకరు. కానీ, ప్రణీత మాత్రం, ‘‘మహేశ్‌తో కలసి నటించే అవకాశం రావడమే బ్రహ్మాండం. దాంతో, నా ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ప్రతిభావంతులైన వేర్వేరు దర్శకులు, హీరోలతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్. తెర మీద ఎంతసేపు కనిపిస్తామనే దాని కన్నా, ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు చేయడం ముఖ్యం’’ అని అన్నారు.
ఆ మధ్య సూర్యతో తమిళ సినిమా ‘మాస్’లో విషాదాంతమైన చిన్న పాత్ర చేసిన ప్రణీత తాజాగా మంచు విష్ణుతో కలసి ‘డైనమైట్’లో ఫైట్లు చేశారు. ‘‘ఇలాంటి వెరైటీ సినిమాలే ఇప్పుడు నాలో ఉత్సాహం నింపుతున్నాయి’’ అని ప్రణీత చెప్పారు. బెంగళూరులోని లావెల్లే రోడ్‌లోని ఒక రెస్టారెంట్‌లో భాగస్వామ్యం తీసుకున్న ఈ అందాల తార అలా వ్యాపారరంగంలో కూడా కాలుమోపారు. ఒక పక్క తెలుగు, తమిళ సినిమాలు, మరోపక్క వ్యాపారం! మొత్తానికి, ప్రణీతకిప్పుడు చేతి నిండా పని, మనసు నిండా ఆనందం అన్న మాట!