
అతను అలాగే ఉండాలి!
ఈ తరం కథానాయికల్లో శ్రుతీహాసన్‌ది కాస్త విభిన్నమైన శైలి. కమల్‌హాసన్ నటవారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రుతి నటిగానే కాకుండా గాయనిగా, స్వరకర్తగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. ఎవరి మీదా ఆధారపడకుండా జీవించాలనేది ఆమె సిద్ధాంతం. ఇప్పుడే కాదు..చిన్నతనం నుండి నేనింతే అంటున్నారామె. ‘‘చిన్నతనం నుండి నేను స్వతంత్రంగానే ఉంటూ వచ్చాను. చివరికి హోమ్‌వర్క్‌లు కూడా నేను చేయాల్సిందే. పాపం మా అమ్మ సాయం చేద్దామనుకంటే నేను మాత్రం అసలు ముట్టుకోనిచ్చేదాన్ని కాదు.
అందుకే ఇప్పటికీ నేను వేరే చోట ఉండటానికే ఇష్టపడతాను. నాకు కుటుంబమంటే ఇష్టమే కానీ నా స్పేస్ నాకు కావాలి. రాత్రి నిద్రపోవాలి... ఉదయాన్నే నిద్రలేవాలి అదీ ఒంటరిగానే’’ అని చెప్పారు. మరి పెళ్లి చేసుకునే ఆలోచనా ఉందా? అని అడిగితే- ‘‘నాక్కాబోయే వాడు చాలా టాలెంటెడ్ అయి ఉండాలి. కానీ, అతను ఎలాంటి విజయాలు సాధించినా, ఎంత పనిచేసినా రాత్రి ఇంటికి వ చ్చేసరికి నన్ను బాగా చూసుకోవాలి. నా మీద ఆ అలసటను, ఒత్తిడిని చూపించకూడదు. అలా ఉండటం ఎవరికైనా కష్టమే. కానీ, అలాంటి వాణ్ణే పెళ్లి చేసుకుంటా’’ అని చెప్పారు. మరి శ్రుతి జీవితానికి లయ జత కలిపేది ఎవరో?