సినిమా రివ్యూ: ఎవడు
సినిమా రివ్యూ: ఎవడు
Published Sun, Jan 12 2014 2:34 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
పాజిటివ్ పాయింట్స్:
రాంచరణ్ యాక్టింగ్
వంశీ పైడిపల్లి డెరైక్షన్
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
కామెడీ
మితిమీరిన హింస
సత్య(అల్లు అర్జున్), దీప్తీ (కాజల్) ప్రేమికులు. ధీరూభాయ్(రాహుల్ దేవ్)అనే గూండా దీప్తిని చూసి ఇష్టపడతాడు. దీప్తి కోసం ధీరూభాయ్ గుండాలు వెంటాడుతుంటారు. దీప్తి ప్రేమ కోసం ధీరూభాయ్‌ని ఎదిరించడానికి సిద్ధమవుతాడు. కాని గుండాలతో సత్య గొడవ పడటం దీప్తికి ఇష్టం ఉండదు. దాంతో సత్య, దీప్తిలు హైదరాబాద్ నుంచి పారిపోవాలనుకుంటారు. కాని ధీరుభాయ్ మనుషులు చేసిన ఎటాక్‌లో దీప్తి చనిపోగా, ముఖం కాలిపోయి, తీవ్ర గాయాలతో, కొన ఊపిరితో ఆస్పత్రిలో చేరిన సత్యకు చరణ్ రూపు రేఖల్ని కల్పించి డాక్టర్(జయసుధ) బ్రతికిస్తుంది. ఆతర్వాత దీప్తిని తనకు కాకుండా చేసిన ధీరూభాయ్ గ్యాంగ్‌ను చరణ్ రూపంలో ఉన్న సత్య చిత్ర తొలిభాగంలోనే మట్టుపెడుతాడు. అంతా అయిపోయిందని భావించే తరుణంలో చరణ్‌ను చంపడానికి ఎటాక్ జరుగుతుంది. అయితే చరణ్ ఎవరు? చరణ్‌పై ఎందుకు ఎటాక్ జరిగింది? చరణ్ గతం ఏమిటి? చరణ్‌కు డాక్టర్ సంబంధమేమిటి? వేరే గ్యాంగ్‌కు చరణ్‌ను చంపాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలకు చిత్ర రెండవ భాగంలో సమాధానం దొరుకుంది.
తుఫాన్ చిత్రం దారుణమైన ఫ్లాప్ తర్వాత సరియైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్‌కు మరోసారి సామర్ధ్యాన్ని ప్రూవ్ చేసుకుని..విజృంభించడానికి రామ్ చరణ్‌కు చక్కటి పాత్ర ఎవడు చిత్రం ద్వారాలభించింది. ఈ చిత్రంలో సత్య రూపంలో ఉన్న చరణ్‌గా తొలిభాగంలో ఆకట్టుకున్నాడు. ఇక రెండవ భాగంలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న చరణ్ పాత్ర ’ఎవడు’కి జీవం పోసి.. ఫుల్ మార్కులను కొట్టేసింది. యధాప్రకారం డాన్స్‌లు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో చెర్రీ ఇరగదీశాడనే చెప్పవచ్చు. అన్ని రకాల ఎమోషన్స్ పలికించే పాత్రను పోషించడానికి రామ్ చరణ్ కు 'ఎవడు' ద్వారా అవకాశం దక్కింది.
సత్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించేది కాసేపైనా.. ఉన్నంత సేపు తన మార్కు నటనతో పరిణతిని ప్రదర్శించాడు.
దీప్తిగా కాజల్‌ది అతిధి పాత్ర అయినా.. మరికొంత సేపు కనిపిస్తే బాగుండేదనే ఫీలింగ్‌ను కలిగించింది. అతిధి పాత్రలో కాజల్ గ్లామరస్‌గా కనిపించింది. ఎమీ జాక్సన్ అందాల ఆరబోతకు పనికి వచ్చింది. ఇక చిత్ర సెకాండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే శృతిహాసన్‌కు గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌కు స్కోప్ ఉండే పాత్ర లభించింది. తన పాత్ర పరిధి మేరకు శృతిహాసన్ వందశాతం న్యాయం చేసింది.
విలన్ల విషయానికి వస్తే తొలిభాగంలో రాహుల్‌దేవ్, రెండవ భాగంలో సాయికుమార్, కోట శ్రీనివాస్‌లు ఈచిత్రానికి మూలస్థంభాల్లా నిలిచారు. హీరో పాత్రను ఇమేజ్‌ను పెంచడానికి రాహుల్ దేవ్, సాయికుమార్ పాత్రలు బాగా సహకరించాయి. కారెక్టర్ ఆరిస్టుల్లో ఎల్‌బి శ్రీరాం మరోసారి గుర్తుండిపోయే పాత్రను చేశారు. ఇక డాక్టర్ జయసుధకు ఇలాంటి పాత్రలకు కొత్తేమి కాకున్నా..చక్కటి ఫీల్‌ను కల్పించడానికి ఉపయోగపడింది. బ్రహ్మానందం కామెడీ అంతంత మాత్రంగానే ఉంది.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన ’నీ జతగా నేనుండాలి’, ’నిన్ను చూడకుంటే చెంపల్లోన పింపుల్స్, ప్రీడమ్ పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెంపోను పెంచింది. ఫోటోగ్రఫీ, ఫైట్స్ చిత్రానికి అదనపు ఆకర్షణ.
తెలుగు సినిమాకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయే రెగ్యులర్ ఫార్మాట్‌తో, ఎలాంటి ప్రయోగాలు చేయకుండా, పక్కా కమర్షియల్ ఎలిమింట్స్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేస్తే హిట్ కొట్టవచ్చు అనే సిద్దాంతాన్ని దర్శకుడు వంశీ పైడిపల్లి నమ్మినట్టు స్పష్టంగా కనిపించింది. కథలో వేగం తగ్గకుండా, చక్కటి స్క్రీన్‌ప్లేతో పరిగెత్తించాడు. ’ఎవడు’ చిత్రంలో అన్ని విభాగాలను బాలెన్స్ చేయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తొలి భాగంలో లాజిక్కుల దూరంగా.. రెండవ భాగంలో హింస మితిమీరినట్టు అనిపించినా.... వాటిపై పాజిటివ్ అంశాలు డామినేట్ చేయడంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. పలు రకాల కారణాలతో ఈ చిత్రం అనేకమార్లు వాయిదా పడటం విసుగుపుట్టించినా..చివరకు సంక్రాంతి రేసులో మైరుగైన ఫలితాన్ని రాబట్టడంలో నిర్మాత దిల్‌రాజు మరోసారి పైచేయి సాధించాడు. ఓ బ్లాక్‌బస్టర్ (మగధీర మినహాయిస్తే)కోసం వేచి చూస్తున్న రామ్ చరణ్.. తన సొంత ఇమేజ్‌తో ‘ఎవడు’ ద్వారా ఓ భారీ హిట్‌ను సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
--రాజబాబు అనుముల
Advertisement
Advertisement