భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
సాక్షి, యాదాద్రి : ‘‘ఆడపిల్లల పెంపకంపై ముందుగా తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను చూడాలి. ప్రతిచోటా ఎదురవుతున్న వివక్షను రూపు మాపడానికి ఇదొక మార్గం. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిసున్నా కొన్ని చోట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. దీన్ని రూపుమాపాల్సిన అవసరం కుటుంబం, సమాజం, పాలకులపై ఉంది’’అని అంటున్నారు ప్రభుత్వ విప్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత. మహిళా సాధికారితపై ‘ఆమె’సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
లింగవివక్ష ఇంకా కొనసాగుతోంది. ఆడపిల్ల పుడితే కష్టం, చదివించడం, భద్రత కల్పించడం, తొందరగా పెళ్లిళ్లు చేయడం వంటి ఆలోచన విధానం ఇంకా కొనసాగుతోంది. ఆడపిల్ల పుడితే భార్య ముఖం చూడని భర్తలు, అత్తమామలు ఇంకా ఉన్నారు. తమ కొడుకుకు మరో వివాహం చేస్తామనే ఆలోచన విధానమూ ఉంది. ఆడ, మగ ఎవరైతే ఏంటి అనే మార్పు ఇప్పటివరకు 50శాతం వచ్చింది. మరో 40శాతంలో మాత్రం దేవుడు ఇచ్చాడనుకుని సర్దుకుపోతున్నారు. అయితే ముందుగా తల్లుల్లో మార్పులు రావాలి. మగబిడ్డ పుడితే బాగుంటుందనే భావన తొలగిపోవాలి. పుట్టిన బిడ్డ ఎవరైతేనేమి అనే మానసిక పరివర్తన తల్లికి వచ్చినప్పుడు ఈ వివక్ష ఉండదు. ఉద్యోగ విషయాల్లో మాత్రం వివక్ష కొంత తక్కువగా ఉంది. వ్యాపార రంగాలకు వచ్చినప్పుడు మహిళల పట్ల అపనమ్మకం ఏర్పడుతోంది. అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పుడు వ్యాపార రంగంలో ఎందుకు మహిళలు రాణించారనే ఆలోచన విధానం రావాలి.
ఏం పనిచేయని మగవారే వేధిస్తున్నారు..
గతంలో గృహహింస అంటే కట్నం కోసం మాత్రమే భర్త, అత్తమామ కొన్నిచోట్ల ఆడపిల్లలు వేధించేవారు. ప్రస్తుతం సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. మహిళలు ఇంటి నుంచి బయటికి వెళ్లి కుటుంబ పోషణకు అవసరమయ్యే డబ్బు సంపాదిస్తున్నారు. ప్రత్యామ్నాయ పనుల వైపు మహిళలు అడుగులు వేస్తున్నారు. అయితే పనిచేయక ఊరికే కూర్చుండే కొందరు మగవారు మహిళల ఆర్థిక, సాధి కారతను భరించలేక భార్యలపై హింసకు పాల్పడుతున్నారు.
విద్యారంగంలో స్త్రీ, పురుష అసమానతలు
విద్యారంగంలో స్త్రీ, పురుష అసమానతలు అత్యధికంగా ఉన్నా యి. అబ్బాయిలను ఇంజనీరింగ్, డాక్టర్ వంటి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులు, అమ్మాయిల విషయంలో వివక్ష చూపుతున్నారు. పెద్దగా ప్రాధాన్యం లేని చదువులను చదివిస్తున్నారు. అబ్బాయిల స్థాయిలో అ మ్మాయిలను చూడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment