విద్యతోనే వివక్ష దూరం | kamareddy sp swetha interview | Sakshi
Sakshi News home page

విద్యతోనే వివక్ష దూరం

Published Tue, Feb 13 2018 1:50 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

kamareddy sp swetha interview - Sakshi

కామారెడ్డి ఎస్పీ శ్వేత

‘‘ఆడపిల్లలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. అంతరిక్షంలోనూ అడుగుపెట్టారు. అయినా ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ వివక్షకు పుల్‌స్టాప్‌ పడాలంటే బాగా చదువుకోవాలి. సొంత కాళ్లపై నిలబడాలి. అప్పుడే వివక్ష దూరమవుతుంది’’ అని కామారెడ్డి ఎస్పీ శ్వేత అన్నారు. అపజయాలకు కుంగిపోవద్దని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వచ్చి ఒడిని చేరతాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు రావాలన్నారు. స్త్రీలపై వివక్ష, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాధికారతపై ఆమె అభిప్రాయాలు.. 

సాక్షి, కామారెడ్డి: ‘సమాజంలో మార్పు వచ్చింది. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. కానీ తరతరాలుగా కొనసాగుతున్న చిన్నచూపు ఇంకా ఉంది. చాలా మంది ఆడపిల్లను భారంగానే భావిస్తున్నారు. ఆడపిల్లలు చదువుకోవడం వల్ల వివక్ష కొంత తగ్గింది’’ అని ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. బాగా చదువుకుంటే వివక్షకు దూరం కావచ్చన్నారు. వివిధ అంశాలపై ఆమె అభిప్రాయం.

వివక్షకు కారణాలు, అధిగమించే మార్గాలు.. 
సమాజంలో తరతరాలుగా ఆడపిల్లలపై వివక్ష అనేది కొనసాగుతూ వచ్చింది. మగవారికంటే తక్కువ, బలహీనులు అన్న భావన ఉంది. కానీ కాలం మారుతోంది. ఆధునిక కాలంలో మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. కష్టసాధ్యమైన లక్ష్యాలనూ చేరకుంటున్నారు. అంతరిక్షంలోనూ అడుగిడి వచ్చారు. విజయాలు సాధిస్తుండడంతో వివక్ష కొంత తగ్గింది. అయితే వివక్ష పూర్తిగా తొలగాలంటే అందరూ బాగా చదవాలి. ఉన్నత విద్యనభ్యసించాలి. ఉద్యోగాలు చేయాలి. సొంత కాళ్లపై నిలబడగలిగినప్పుడు వివక్ష అనేది అటోమెటిక్‌గా తగ్గిపోతుంది. 

లక్ష్యంతో సాగితే.. 
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగంపై ఆసక్తి ఉంటుంది. అయితే ఆయా రంగాల్లో రాణించాలన్న తపన ఉండాలి. అందుకు అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. లక్ష్య సాధన కోసం శ్రమించాలి. అపజయాలకు కుంగిపోవద్దు. విజయం సాధించాలన్న లక్ష్యంతో సాగాలి. ముందుగా మనపై మనకు నమ్మకం ఉండాలి. నేను సాధించగలను అన్న విశ్వాసం ఏర్పర్చుకోవాలి. లక్ష్య సాధనలో ఓటమి ఎదురైనా.. మరింత పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. 

మహిళా సాధికారత సాధించాలంటే.. 
చదువే అన్ని సమస్యలకూ పరిష్కారం. ఆ దిశగా ముందుకు సాగాలి. అప్పుడే మహిళా సాధికార త అనేది సాధ్యమవుతుంది. మహిళలు నేడు సాధిస్తున్న విజయాలను చూసి ఒకరినొకరు స్ఫూర్తిని పొందాలి. నేను కూడా సాధిస్తానన్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆత్మన్యూనతా భావాన్ని విడనాడాలి. చదువు ఉంటే ఏ వివక్షా ఉండదు. చదువే అన్నింటికీ పరిష్కారం. ఆడపిల్లలు బాగా చదవాలి. నేనిచ్చే సందేశం ఇదే.   

ఆడపిల్లను భారంగా భావించొద్దు 

ఆడపిల్లలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తున్నారు. తెలిసీ తెలియని వయసులో వివాహం జరిపించడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు తమ బాధ్యతను తీర్చుకుంటున్నామంటూ అమ్మాయి మనసును అర్థం చేసుకోకుండానే వివాహం చేయడం మూలంగా ఆమె చాలా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. చిన్న వయసులోనే పిల్లలను కనడం వల్ల మరింత బలహీనంగా తయారై మానసికంగానూ ఇబ్బంది పడుతున్నారు. తద్వారా కుటుంబంలో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లలు వారి సొంతకాళ్లపై నిలబడి, శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహం జరిపించాలి.  

చదువు చెప్పించాలి 
చాల కుటుంబాల్లో ఇప్పటికీ ఆడపిల్లకు చదువు ఎందుకనే భావన ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆడ, మగ అన్న తేడా చూపకుండా ఒకే రకమైన చదువు అందేలా చూడాలి. పెళ్లి బరువు అనే భావనను వీడాలి. ఆడపిల్ల బాగా చదువుకోవడానికి తగిన ప్రోత్సాహం అందించాలి. వారికి అండగా ఉన్నామన్న ధీమా ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీతోనే చదువుకు పుల్‌స్టాప్‌ పెట్టేస్తున్నారు. ఆ తర్వాత వివాహం జరిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. మా వద్దకు వచ్చే కేసుల్లో చాలా వరకు చిన్న వయసులో పెళ్లిళ్లు అయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లికి ఇచ్చే ప్రాధాన్యతకన్నా చదువుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది. తద్వారా వివక్ష రూపుమాపవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement