సూర్యాపేట డీఈఓ వెంకటనర్సమ్మ
సూర్యాపేటటౌన్ : ‘‘ప్రస్తుతం ఉన్న సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించాలి.. తనకు నచ్చిన రంగంలో స్థిరపడే వరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.. కుటుంబంనుంచి వారి పట్ల వివక్ష లేకుండా ఉండాలి.. అసమానతలు.. వేధింపులు.. అవమానాలు.. ఈ మూడింటిని అధిగమించినప్పు డే మహిళ ధైర్యంగా ముందుకెళ్తుంది’ అంటున్నారు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటనర్సమ్మ. సాక్షి మహిళా క్యాం పెయిన్‌లో భాగంగా మహిళా సాధికారతపై ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే... తనకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని లక్ష్యం చేరే వరకు పోరాడాలి. దీనికి కుటుంబం నుంచి ప్రోత్సహం తప్పకుండా ఉండాలి. అమ్మాయిలపై కుటుంబంనుంచి వివక్ష లేకుండా చూడాలి. సమాజంలో అమ్మాయిలకు ఒక తీరు.. అబ్బాయిలకు ఒక తీరు.. కాకుండా సమానంగా హక్కులు కల్పించాలి. మహిళలపై వేధింపులు లేని సమాజాన్ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కొంత మేరకు మహిళలపై వేధింపులు ఆపడానికి కొన్ని చట్టాలు తీసుకొచ్చినా.. అవి నామమాత్రంగా కాకుండా బలంగా అమలు చేయాలి. మహిళలపై వేధింపులు జరిగినప్పుడు మహిళలు బయటకు వచ్చి చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి. అలా కాకుండా మహిళలపై వేధింపులు జరిగినప్పుడు తక్షణమే చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు చేసే దిశగా ప్రభుత్వం చూడాలి.
చైతన్యం తీసుకురావాలి
ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడానికి షీటీం, తదితర చట్టాలను తీసుకొచ్చింది. కానీ షీటీం లాంటి చట్టాలపై మహిళలకు చైతన్యం తీసుకురావాలి. చట్టం ప్రకారం ఎంతటి వారినైనా శిక్షించాలి. ముఖ్యంగా మహిళలల్లో తమకు తాము తక్కువ అనే భావన పోవాలి. సమయ సందర్భాలను బట్టి తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి. విద్య ద్వారానే విజ్ఞానం ధైర్యం, లోకజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. కావున మహిళలు విద్యావంతులవ్వాలి.
విద్యతోనే అందలం..
మహిళా సాధికారిత కోసం మహిళలు ఉన్నత చదువులు విద్యనభ్యసించాలి. విద్య ముఖ్యమైన సాధనం. ఆడిపిల్లలను వారి తల్లిదండ్రులు బాగా చదివించాలి. ఎలాంటి బేధాలు చూపించకూడదు. విద్య ద్వారానే విద్యావంతులవుతారు. జ్ఞానం సంపాదించినప్పుడే ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారు. ఆడ పిల్లలను చిన్నప్పటి నుంచే ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలి. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయవద్దు. శారీరకంగా, మానసికంగా ఎదిగిన తర్వాతే వివాహం జరిపించాలి. తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment