సాక్షి, కోదాడ : తెలంగాణ ప్రభుత్వం 57 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే ఏప్రిల్ నుంచి 2,016 రూపాయల పింఛన్ ఇస్తామని ప్రకటించడంతో పట్టుమని 40 సంవత్సరాలు నిండని వారు వృద్ధుల అవతారం ఎత్తుతున్నారు. మీ సేవ కేంద్రాలే అడ్డాగా ఆధార్, ఓటరు కార్డుల్లో వయస్సును అమాంతం పెంచుకుంటున్నారు. కోదాడ పట్టణంలో దీని కోసం ప్రత్యేక అడ్డాలు ఏర్పడ్డాయి. కొందరు ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఓలు, వారి భర్తలు దీన్ని లాభసాటి వ్యాపారంగా చేసుకున్నారు. వేల సంఖ్యలో కాగితాల్లో వృద్ధులు తయారు అవుతున్నారు. పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, శ్రీరంగాపురం, సాలార్‌జంగ్‌పేట, బాలాజీనగర్‌లో ఇప్పటికే మార్పిడి యథేచ్ఛగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు వల్ల భవిష్యత్‌లో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది.
దళారుల దందా..
వాస్తవానికి ఆసరా పింఛన్ కోసం ఆధార్‌కార్డు వయస్సుతో సంబంధం లేదు. కేవలం ఓటరు కార్డులోని వయస్సును ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. కానీ కొందరు దళారులు ఆధార్ కార్డులో కూడా వయస్సు పెంచాలని మభ్యపెడుతూ సామాన్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. ఇక ఓటరు గుర్తింపు కార్డుల్లో వయస్సు పెంపు కోసం పలువురు బీఎల్‌ఓలు కూడ భారీగా పుచ్చుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలో కోదాడ తహసీల్దార్ వద్ద పని చేసిన ఓ వ్యక్తి కొంత మంది కార్యాలయ ఉద్యోగులతో ఉన్న సంబంధాలతో ఈ దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం.
పట్టణ శివారు గ్రామాలైన లక్ష్మీపురం, బాలాజీనగర్, సాలార్‌జంగ్ పేటలలో కూడా ఈ దందా పెద్దెత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరంగాపురం గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి వయస్సు వాస్తవంగా 45 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ కార్డుల్లో వయస్సును పెంచుకుని కొంత కాలంగా పింఛన్ పొందడం గమనించదగ్గ విషయం.
పింఛన్‌ల పంపిణీలో చేతివాటం..
కోదాడ పట్టణంలో దాదాపు 5 వేల వరకు వివిధ రకాల పింఛన్‌లను ప్రతి నెలా అందించాల్సి ఉంది. కానీ పట్టణంలో 3 బయోమెట్రిక్ యంత్రా లే ఉండడంతో పరిసర గ్రామాలలో ఉన్నవారిని కోదాడకు పిలిపించి పింఛన్లు ఇప్పిస్తున్నారు. అయితే వీరు తపాలా కార్యాలయంలో ఇవ్వాల్సిన పింఛన్లను ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తూ ప్రతి లబ్ధిదారు నుంచి 50 రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా వేలిముద్రలు పడడం లేదని కొంద మంది కోదాడలో లేకున్నా వారి పింఛన్లను పెద్ద ఎత్తున డ్రా చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
పింఛన్ల పంపిణీ సమయంలో వేలి ముద్రలు పడని వారి కోసం మున్సిపాలిటీ 1–15 వార్డులకు ఒకరిని, 16–30 వార్డులకు మరొకరిని నియమించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కీలకంగా వ్యవరిస్తున్నారని సమాచారం. పింఛన్లు పొందుతున్న వారు కోదాడలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉంటున్నారు. వారి వేలు ముద్రలు పడడం లేదని మున్సిపాలిటీ ఉద్యోగులు డబ్బులు డ్రా చేస్తున్నారని, దీని కోసం రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో చనిపోయిన వారివి కూడా వేలి ముద్రలు పడడం లేదని నొక్కేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు
పింఛన్ల పంపిణీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. వేలి ముద్రలు పడనివారి పింఛన్లను మాత్రమే మున్సిపల్ ఉద్యోగులు డ్రా చేయాలి. చనిపోయిన వారి పింఛన్లు డ్రా చేసినట్లు తెలిస్తే తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలి. విచారించి తగు చర్యలు తీసుకుంటాం. – కందుల అమరేందర్‌రెడ్డి, కోదాడ మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment