సూర్యాపేట జిల్లా కందగట్ల పోస్టాఫీసు ఎదుట వృద్ధుల పడిగాపులు
సాక్షి, నెట్‌వర్క్: ఈ నెల ‘ఆసరా’ లేక పింఛన్‌దారులు ఆగమాగమవుతున్నారు. పింఛన్ డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియని అయోమయంలో ఉన్నారు. మందులు కొనలేకపోతున్నారు. నిత్యవసరాలు సమకూర్చుకోలేకపోతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే చేతికందే ‘ఆసరా’పెన్షన్ ఈ సారి మూడు వారాలు గడిచినా ఇంకా జాడలేదు. గతంలో ఎప్పుడూలేని రీతిలో ఈసారి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెన్షన్ డబ్బులు వస్తాయన్న ధీమాతో కొడుకులు, కూతుళ్లకు దూరంగా ఉంటున్న వృద్ధులు, వితంతువులు ఇప్పుడు దిక్కులు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి రోజూ పోస్టాఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తే తాము ఫైనాన్స్ విభాగానికి నివేదించామని, వారు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు.
ఎదురుచూపుల్లో 38 లక్షల మంది...
ఆసరా పింఛన్ కింద ప్రతి నెలా ఆయా వర్గాలకు ప్రభుత్వం 2,016 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఆగస్టు నెల కింద అందాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 38 లక్షల 71 వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వీవర్స్, హెచ్‌ఐవీ బాధితులు, బోదకాలు బాధితులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది అయినవారికి దూరంగా ఉంటున్నవారే. ఇంకా పలువురు చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చూస్తున్న వారూ ఉన్నారు.
మస్తు ఇబ్బంది అవుతోంది
చిల్లర ఖర్సులకు మస్తు ఇబ్బంది పడుతున్న. రోజూ పోస్ట్ ఆఫీస్‌కు వచ్చి పోతున్న. ఇప్పుడు, అప్పుడు అంటున్నరు. ఎప్పుడు ఇస్తారో ఏమో. మస్తు ఇబ్బంది అవుతుంది.
– అమ్రు, హజీపూర్, కామారెడ్డి జిల్లా
పింఛన్ రాక మస్తు ఇబ్బంది పడుతున్నాం. ఆఫీసర్లను అడిగితే రేపు మాపంటున్నరు. ఇంతకు ముందు ఆరో తారీఖు ఇస్తుండిరి. ఇప్పుడు పదిహేను రోజులైనా అస్తలేవు.
– రుక్కవ్వ, సోమార్‌పేట్, కామారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment