నాటి హైకోర్టు తీర్పులో అసంబద్ధతలివీ.. | 10 main issues in jaya case that karnataka hicourt supported | Sakshi
Sakshi News home page

నాటి హైకోర్టు తీర్పులో అసంబద్ధతలివీ..

Published Tue, Feb 14 2017 9:05 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

నాటి హైకోర్టు తీర్పులో అసంబద్ధతలివీ.. - Sakshi

నాటి హైకోర్టు తీర్పులో అసంబద్ధతలివీ..

జయ కేసులో కర్ణాటక ప్రభుత్వం సవాల్ చేసిన 10 అంశాలు
జయలలితపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయ సహా నలుగురుని దోషులుగా నిర్ధారిస్తూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును.. కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. జయలలిత సహా నలుగురినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పులో పేర్కొన్న పలు అంశాలను.. హైకోర్టు అసంబద్ధంగా మార్చిందని, ఆస్తుల లెక్కల్లో తేడాలు ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అందులో 10 కీలకమైన అంశాలను లేవనెత్తింది. దీని ఆధారంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ఆర్.కుమారస్వామి ఇచ్చిన తీర్పును తాజాగా కొట్టివేసింది. విచారణ కోర్టు అయిన ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. నలుగురు నిందితులూ దోషులేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. కర్ణాటక ప్రభుత్వం తన అప్పీలులో లేవనెత్తిన 10 కీలక అంశాలు ఇవీ...

మొత్తం భవనాల విలువ: 1,66,839.68 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలకు సంబంధించి పీడబ్ల్యూడీ విలువకట్టి, 20 శాతం తగ్గించిన తర్వాత, మొత్తం ఖరీదును రూ. 22,53,92,344 గా విచారణ కోర్టు నిర్ణయించింది. ఈ భవనాల నిర్మాణ వ్యయాన్ని హైకోర్టు మళ్లీ విలువకట్టింది. మొత్తం విలువ రూ. 5,10,54,060 గా నిర్ణయించింది. ‘ఖరీదైన బహుళ అంతస్తుల భవనాల’ నిర్మాణ వ్యయాన్ని, పీడబ్ల్యూడీ ‘షెడ్డు’ నిర్మాణంతో పోల్చింది. హైకోర్టు నిర్ధారించిన మొత్తం ఖరీదు రూ. 5.10 కోట్లు.. నిందితులు స్వయంగా అంగీకరించిన ఖరీదు రూ. 8,60,59,261 కన్నా తక్కువ.

‘దత్త పుత్రుడు’ వి.ఎన్.సుధాకరన్ వివాహ వ్యయం: ఈ వ్యయం రూ. 6,45,04,222 గా ప్రాసిక్యూషన్ లెక్కకట్టింది. విచారణ కోర్టు ఈ వ్యయం మొత్తం రూ. 3,00,00,000 గా నిర్ణయించింది. హైకోర్టు ఒక్క జయలలిత ఆదాయ పన్ను పత్రం ప్రాతిపదికగా ఆ మొత్తాన్ని కేవలం రూ. 28.68 లక్షలకు తగ్గించింది.
 
ఆదాయంలో భాగంగా రుణాలు: నిందితులు తీసుకున్న రుణాల విలువ రూ. 5,99,85,274 అని డీవీఏసీ గుర్తించింది. అయితే జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న పది రుణాల మొత్తం రూ. 24,17,31,274 వివరాలను డీవీఏసీ విస్మరించిందని హైకోర్టు పేర్కొంది. ఈ అంశాన్ని నిందితులు, తమ అప్పీళ్లలో కానీ, హైకోర్టుకు రాతపూర్వకంగా సమర్పించిన వినతులలో కానీ ఎక్కడా చెప్పలేదు. హైకోర్టు న్యాయమూర్తి ఆ పది రుణాల మొత్తాన్ని లెక్కగట్టడంలో పొరపాటు చేశారు. అవన్నీ కలిపితే కేవలం రూ. 10.67 కోట్లు మాత్రమే అవుతాయి, రూ. 24.17 కోట్లు కాదు.

అక్రమాస్తుల వాటా 76.7 శాతం: కర్ణాటక ప్రభుత్వం లెక్క ప్రకారం మొత్తం ఆస్తులు రూ. 37,59,02,466 కాగా.. అందులో మొత్తం ఆదాయం రూ. 21,26,65,654 తీసివేయగా వచ్చిన రూ. 16,32,36,812 అక్రమాస్తులు. దీనిని 100తో హెచ్చించగా వచ్చిన మొత్తాన్ని.. ఆదాయం రూ. 21,26,65,654 తో భాగిస్తే.. అది 76.7 శాతం అవుతుంది.

ద్రాక్ష తోట నుంచి ఆదాయం: హైదరాబాద్లోని ద్రాక్ష తోట నుంచి మొత్తం వ్యవసాయ ఆదాయం రూ. 5,78,340 గా ప్రాసిక్యూషన్ లెక్కగట్టింది. ఆ ఆస్తి నుంచి వచ్చిన ఆదాయం రూ. 52,50,000 అని జయలలిత లెక్కగట్టారు. విచారణ కోర్టు ఆ ఆదాయాన్ని రూ. 10,00,000 గా లెక్కించింది. ఆ ఆదాయాన్ని హైకోర్టు రూ. 46,71,600 అని లెక్కించింది.

ఆదాయం లెక్కలో కానుకలు: జయలలిత తన 44వ జన్మదినం రోజున అందుకున్న రూ. 1.5 కోట్ల విలువైన కానుకలను హైకోర్టు చట్టబద్ధమైన ఆదాయంగా పరిగణించింది. కర్ణాటక ప్రభుత్వం వేసిన పిటిషన్లో.. ఈ అంశంపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు వద్ద పెండింగ్లో ఉందని, నిందితులు ఈ వాస్తవాన్ని హైకోర్టు దృష్టికి తీసుకురాలేదని పేర్కొంది. అలాగే, అవినీతి నిరోధక చట్టం ప్రకారం.. చట్టబద్ధమైన ఆదాయ వనరుగా స్వీకరించిన ఏ కానుక గురించి అయినా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని ప్రస్తావించింది.

శశి ఎంటర్‌ ప్రైజెస్‌ ఆదాయం: జయలలిత, శశికళ నటరాజన్ల భాగస్వామ్య సంస్థ అయిన శశి ఎంటర్‌ ప్రైజెస్‌కు రూ. 12,60,800 అద్దె ఆదాయం ఉందని, కానీ ప్రాసిక్యూషన్ కేవలం రూ. 6,15,900 మాత్రమే పరిగణనలోకి తీసుకుందని నిందితులు సమర్పించిన వినతిని విచారణ కోర్టు తిరస్కరించింది. కానీ.. హైకోర్టు ఊహాత్మక ప్రాతిపదికగా రూ. 25,00,000 మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుందని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.

జయా పబ్లికేషన్స్ ఆదాయం: జయా పబ్లికేషన్స్ ద్వారా మొత్తం వాణిజ్య ఆదాయం రూ. 1.15 కోట్లు అని నిందితులు చెప్పగా, హైకోర్టు తీర్పు దానిని అసంబద్ధంగా రూ. 4 కోట్లకు పెంచింది. మొత్తం టర్నోవర్ను మొత్తం ఆదాయంగా తప్పుగా లెక్కించింది.

సూపర్ డూపర్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ ఆదాయం: మూడో నిందితుడు, సంస్థ ప్రొప్రైటర్ వి.ఎన్.సుధాకరన్ తమ సంస్థ రూ. 1.10 కోట్ల చట్టబద్ధమైన ఆదాయం సముపార్జించిందని పేర్కొన్నారు. విచారణ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. విచారణ కోర్టు నిర్ధారణను హైకోర్టు తీర్పు పక్కనపెట్టేసింది. ఆ ఆదాయం రూ. 1,00,00,000 కోటి అని ఏకపక్షంగా అంచనా వేసింది.

ఆస్తుల విక్రయాల సొమ్ము: స్థిరాస్తులకు సంబంధించి 146 విక్రయాలను విచారణ కోర్టు నమోదు చేసింది. రియల్ ఎస్టేట్ విక్రయాల ద్వారా వచ్చిన ఆ మొత్తం  దాదాపు రూ. 20 కోట్లుగా అంచనా వేసింది. హైకోర్టు తీర్పులో.. ఆ 146 విక్రయాల నుంచి అకారణంగా 49 విక్రయాలను విస్మరించింది. విక్రయాల ద్వారా వచ్చిన మొత్తాన్ని రూ. 6,24,09,120 కి తగ్గించింది.
                                                                                                                      - (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement