శశికళ పట్ల అంత సానుభూతి ఎందుకు?
శశికళ పట్ల అంత సానుభూతి ఎందుకు?
Published Wed, Feb 15 2017 3:07 PM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM
న్యూఢిల్లీ:
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు చిన్నమ్మ శశికళకు దేశంలోని అత్యుత్తమ న్యాయస్థానమైన సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించినప్పటికీ ఆమె వర్గీయుల్లో లేదా ఆమె అభిమానుల్లో ఎందుకు మార్పు రావడం లేదు. ఆమెను ఎందుకు దోషిగా చూడడం లేదు? ఇప్పటికీ ఆమెను చిన్నమ్మగా ఎలా గౌరవించగలుగుతున్నారు? పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరు పోలీసు స్టేషన్‌కు బయల్దేరిన శశికళను ఓ స్వాతంత్ర్య యోధురాలిని సాగనంపటానికి వచ్చినట్లుగా తండోప తండాలుగా ఎలా తరలివచ్చారు, ఎందుకు తరలివచ్చారు?
ప్రజలకు రాజకీయ నాయకుల అవినీతి కేసులు పట్టకుండా పోతున్నాయా? ఏ రాజకీయ నాయకుడు అవినీతి పరుడుకాకుండా ఉన్నాడా అన్న నిర్లిప్త ధోరణి ప్రజల్లో పెరిగిపోతుందా? అవినీతి కేసులో శశికళకు జైలు శిక్ష పడితే తమిళనాడులో ఏర్పడిన సంక్షోభం దానంతట అదే సమసిపోతుందని రాష్ట్ర గవర్నర్ సహా పలు వర్గాలు భావించాయి. శశికళ శిబిరంలో ఉన్నవారు ఖాళీ చేసి అంతా తన శిబిరంలో చేరిపోతారని, ఇక తానే ముఖ్యమంత్రిని అవుతాననుకున్న పన్నీర్ సెల్వం నమ్మకం కూడా వమ్మయింది. రాజకీయ నేతల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. అవినీతి మచ్చలేని పన్నీర్ సెల్వం పంచన చేరితే పంచుకునేది ఏమీ ఉండదు, దండుకునేది ఏమీ ఉండదని శశికళ వెనక చేరిన వారు భావించి ఉండవచ్చు. అందుకనే చిన్నమ్మ చెప్పినట్లు పళనిస్వామికి మద్దతిస్తే ప్రయోజనాలు పొందవచ్చని ఆశించి ఉండవచ్చు!
ఇలాంటి ధోరణి పాలకపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల నేతల్లో ఉంది. అంతేకాదు, ఎక్కడాలేని విధంగా ఒక్క భారత దేశంలోనే అవినీతి కేసుల విషయంలో పాలక, ప్రతిపక్షాలు పరస్పరం రక్షించుకునే వ్యూహాలు కూడా ఉన్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి గగ్గోలు పెడుతూనే ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అనేక కుంభకోణాల ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని బోను ఎక్కించేందుకు ఇంతవరకు మోదీ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. అవినీతి స్కాముల్లో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాను జైలుకు పంపిస్తామని శపథం చేసిన బీజేపీ నాయకులు కూడా ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదు. రెయిన్ కోటు వేసుకుని స్నానం చేసే వ్యక్తంటూ మన్మోహన్‌ను ఎద్దేవ చేసే మోదీ ఆయనపై కేసు పెట్టేందుకు మాత్రం ముందుకు రారు.
గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల కేసుల్లో మోదీని ప్రత్యక్షంగా ఇరికించే అవకాశం ఉన్నప్పటికీ అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘మౌత్ కే సౌదాగర్, కూన్ కే దలాల్’ అంటూ సోనియా, రాహుల్ గాంధీలు విమర్శించారు తప్ప, అవకాశం ఉన్నప్పుడు మోదీ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 1993లో జరిగిన ముంబై అల్లర్లలో శివసేన పాత్ర ఉందని వెల్లడించిన శ్రీకష్ణ కమిటీ నివేదికను అమలు చేస్తామని హామీ ఇచ్చిన నాటి కాంగ్రెస్, ఎన్‌సీపీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ విషయంలో మన పొరుగు దేశాలు ఎంతో ముందున్నాయి.
బంగ్లాదేశ్‌లో ఖలేదా జియా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థి షేక్ హసీనా అరెస్టయ్యారు. ఆ తర్వాత షేక్ హసీనా అధికారంలోకి వచ్చినప్పుడు మనీ లాండరింగ్ కేసులో ఖలేదా జియా పెద్ద కుమారుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇక పాకిస్తాన్‌లో ఇలాంటివి సర్వసాధారణం. 1996లో బేనజీర్ భుట్టో ప్రభుత్వాన్ని సైన్యం రద్దు చేసినప్పుడు ఆమె ప్రవాస జీవితం అనుభవించాల్సి వచ్చింది. ఆమె సోదరుడు ముర్తజా భుట్టో హత్య కేసులో ఆమె భర్త ఆసిఫ్ అలీ జర్దారి జైలుకెళ్లాల్సి వచ్చింది. ముషార్రఫ్ సైనిక కుట్ర అనంతరం నవాజ్ షరీప్‌కు ఉరితీయాల్సి ఉండింది. సౌదీ అరేబియా రాజు ఫాద్ జోక్యంతో ఆయనకు ఆ ఉరి తప్పింది.
మన దేశంలో మాత్రం రాజకీయ ప్రత్యర్థులు మాటలతోనే ఒకరినొకరు శిక్షించుకుంటారు. అవినీతి కేసుల విషయానికొస్తే అంతా ఒకటే కులం. పరస్పరం రక్షించుకోవడమే వారి అభిమతం. ఇప్పుడు అవినీతి కేసులను ప్రజలు కూడా పట్టించుకోవడం లేదన్నది తమిళనాడులోనే చూస్తున్నాం. –– ఓ సెక్యులరిస్ట్ కామెంట్
Advertisement
Advertisement